మూడోసారి తప్పిన అంచనాలు…

రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న బడ్జెట్‌ లెక్కల ప్రకారం సంక్షేమ పథకాలకు గతేడాది రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉన్నది. కానీ ఆశించిన స్థాయిలో రిజర్వు బ్యాంకు నుంచి అప్పులు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రాకపోవడంతో ఏకంగా రూ.39,701 కోట్ల మేర కోత పెట్టక తప్పలేదు. ఇందులో దళితబంధుకు బడ్జెట్‌ లెక్కల ప్రకారం రూ.17,700 కోట్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వసూళ్లు లేకపోవడంతో పూర్తిగా కోత పెట్టింది.దీనికి తోడు మరికొన్ని వెల్ఫేర్‌ స్కీమ్‌ల అమలునూ పక్కకు పెట్టింది. రాష్ట్ర సొంత ఆదాయం లెక్కకు మించి వచ్చింది. మొత్తంగా రూ.1.26 లక్షల కోట్లుగా అంచనా వేసుకుంటే దానికన్నా అదనంగానే సమకూరింది. ఊహించినదానికన్నా మద్యం ద్వారా వచ్చే ఎక్సయిజ్‌ పన్ను రూ.970 కోట్లు ఎక్కువగా వచ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన డివొల్యూషన్‌ ఎక్కువగానే వచ్చింది.పాత అప్పుల చెల్లింపులతోపాటు ప్రతి నెలా/క్వార్టర్‌ వడ్డీల చెల్లింపు సర్కారు అంచనాకు మించి పెరిగింది. గతేడాది మొత్తం రూ.18,911 కోట్ల మేర వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని బడ్జెట్‌లో లెక్కలు వేసుకున్నది. కానీ చివరకు అది రూ.2,040 కోట్లు పెరిగి రూ.20,952 కోట్ల మేర కట్టాల్సి వచ్చింది. లెక్కలకు తగినట్లు ఆదాయ వనరులు లేకపోవడంతో అప్పులపాలై వడ్డీలకే ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వచ్చింది.దీంతో చివరకు సంక్షేమ పథకాల్లో కోత పెట్టక తప్పలేదు. ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ పింఛన్‌, పాత అప్పుల విూద వడ్డీ చెల్లింపులకు బడ్జెట్‌ లెక్కలకు మించి ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇవన్నీ నివారించలేని ఖర్చులు కావడంతో చేతిలో డబ్బుల్లేక సబ్సిడీలు, సంక్షేమానికి కోత పెట్టాల్సి వచ్చింది. కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రొవిజినల్‌ లెక్కల్లో సర్కారు అంచనాలు ఎలా తలకిందులయ్యాయో వివరించింది. ఏ సంవత్సరం ఎంత వడ్డీ కట్టాలనే లెక్కలు సర్కారు దగ్గర పక్కాగా ఉన్నప్పటికీ అదనంగా రెండు వేల కోట్లు కట్టక తప్పలేదు.దీంతో సర్దుబాటు చేసుకోడానికి సంక్షేమం, సబ్సిడీల విూద కోత పెట్టాల్సి వచ్చింది. ఉద్యోగులకు డీఏ (కరువుభత్యం), కొన్ని కొత్త పోస్టుల నియామకాలు తదితరాలన్నీ ముందుకు రావడంతో అంచనాకు మించి అదనంగా నాలుగు వేల కోట్లు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చింది. రిటైర్డ్‌ ఉద్యోగుల పింఛన్లకూ దాదాపు నాలుగున్నర వేల కోట్లు ఎక్కువ కేటాయించింది.సంక్షేమ పాలనలో అనేక రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా ఉన్నదని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం గతేడాది లక్ష్యాన్ని లక్ష కోట్లుగా నిర్దేశించుకున్నా, అందులో రూ.39,701 కోట్లను తొక్కిపెట్టింది. కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా, రిజర్వు బ్యాంకు అప్పుల ద్వారా మొత్తంగా రూ.93,168 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేసుకున్నది.నిజానికి అంత మొత్తంలో రాదని బడ్జెట్‌ను రూపొందించిన ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టంగా తెలుసు. కానీ బడ్జెట్‌ సైజును పెంచుకోవడం ద్వారా ఈ పద్దుల కింద అంచనాలను పెట్టుకోవడంతో పొందాల్సిన హక్కును వదులుకోరాదని భావించారు. కానీ చివరకు రూ.45,298 కోట్లు మాత్రమే అందాయి. సగానికి పైగా అంచనాలు తలకిందులయ్యాయి. రూ.47,870 కోట్లకు కోతపడిరది. ఆ ఎఫెక్టుతో సంక్షేమం, సబ్సిడీలకు కోత పెట్టక తప్పలేదు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సైతం కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తాయన్న అంచనాలు భారీగానే బడ్జెట్‌లో పేర్కొన్నది. దీనికి తోడు ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి సైతం రూ.17,828 కోట్ల మేర ఇంటర్‌ స్టేట్‌ సెటిల్‌మెంట్‌ రూపంలో వస్తుందని అంచనా వేసుకున్నది. ఈ డబ్బు రాదని తెలిసినా బడ్జెట్‌ సైజును పెంచుకుని రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందుతున్నదనే మెసేజ్‌ను సమాజానికి పంపాలనుకున్నది.వచ్చే ఏడాది మార్చి చివరినాటికి ఈ అంచనాలు కచ్చితంగా తప్పుతాయన్న అభిప్రాయం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల్లో వ్యక్తమవుతున్నది. మొదటి త్రైమాసికంలోనే రిజర్వు బ్యాంకు ద్వారా వస్తాయనుకున్న అంచనాలు తప్పాయి. సెంట్రల్‌ గ్రాంట్ల విషయంలోనూ తేడాలు వచ్చే ప్రమాదాన్ని అధికారులు పసిగట్టారు.ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధులను సమకూర్చుకోకుంటే సంక్షేమం, సబ్సిడీలకు ఈసారి కూడా కోత పెట్టక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ ఉద్యోగుల జీతాలు, పింఛన్‌, కొన్ని పాత అప్పుల రీపేమెంట్‌, వాటి విూద వడ్డీ చెల్లింపు.. ఇలాంటివన్నీ తప్పనిసరి అవసరాలు కావడంతో వాయిదా వేసే అవకాశం లేదు.కానీ ఎన్నికల సంవత్సరం కావడంతో ఏ మార్గాల్లో ఆదాయాన్ని సమకూర్చుకుని సంక్షేమానికి కోత పెట్టకుండా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గతేడాది మొత్తంగా చేయాలనుకున్న రూ.2.19 లక్షల కోట్లలో కేవలం రూ.1.70 లక్షల కోట్లను మాత్రమే (78 శాతం) ఖర్చుచేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *