బీజేపీ, జేడీఎస్‌ వైపు చూపు

సార్వత్రిక ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయం మాత్రమే మిగిలివుంది.. దీంతో అన్ని పార్టీలన్నీ సమయం లేదు మిత్రమా అంటూ వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇప్పుడు అన్ని పార్టీల అజెండా ఒక్కటే 2024 ఎన్నికలు.. ఈ నేపథ్యంలో రాజకీయ సవిూకరణాలు, నేతల స్వరాలు మారుతుండటం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ ఇప్పటినుంచే సన్నాహాలను ప్రారంభించింది. కాంగ్రెస్‌ సైతం కలిసొచ్చే పార్టీలతో పోటీ చేసి సత్తా చాటాలని వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలో పలు ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుండటం.. పొలిటికల్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీతో దోస్తీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవలనే హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. ఈ క్రమంలోనే మరో ప్రాంతీయ పార్టీ బీజేపీతో జత కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు పొలిటికల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటివల కర్నాటక ఎన్నికలలో ఎన్నడూ లేనంత ఘోరమైన ప్రదర్శనతోగ్భ్భ్రాంతికి గురైన జనతాదళ్‌ సెక్యులర్‌ , బిజెపి వైపు మొగ్గు చూపుతోంది. 2024 జాతీయ ఎన్నికలలో బీజేపీ పొత్తు కోసం ఇప్పటికే.. కాషాయ పార్టీ నేతలతో చర్చినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో కర్నాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో ఒకదానిని మాత్రమే గెలుచుకున్న జేడీఎస్‌.. అసెంబ్లీ ఎన్నికల తీర్పు వెలువడిన వారాల వ్యవధిలోనే బీజేపీతో పొత్తుకు సిద్ధమని చెప్పినట్లు పేర్కొంటున్నారు.అయితే, కర్నాటక ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించి.. కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కింగ్‌మేకర్‌ అవ్వాలనుకున్న జేడీఎస్‌ ఆశలపై కాంగ్రెస్‌ నీళ్లు చల్లింది. జేడీఎస్‌ 224 సీట్లలో కేవలం 19 మాత్రమే గెలుచుకుంది. గతంలో కంటే సీట్లు, ఓట్లు తగ్గడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, ఆయన కుమారుడు హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని జెడిఎస్‌.. ఒకప్పటి మిత్రపక్షమైన బిజెపితో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌ను ఓడిరచి తన ఓట్‌బేస్‌ను కాపాడుకునే అవకాశాన్ని అంచనా వేస్తున్నట్లు సమాచారం.2006లో కర్ణాటకలో బీజేపీ ? జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 20 నెలల అధికార భాగస్వామ్య ఫార్ములా ప్రకారం కుమారస్వామి ముఖ్యమంత్రిగా, యడియూరప్ప డిప్యూటీగా ఉన్నారు. అయితే, ఫార్ములా ప్రకారం.. జేడీఎస్‌ అధికారాన్ని బీజేపీకి బదిలీ చేయకపోవడంతో సంకీర్ణం స్వల్పకాలమే పరిమితమైంది. అనంతరం జేడీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీతో జతకట్టింది. అది కూడా స్వల్పకాలంగానే మిగిలింది. ఈ క్రమంలో జేడీఎస్‌ మరోసారి తన మాజీ భాగస్వామి వైపు మొగ్గు చూపుతున్నట్లు పలు సూచనలు కనిపిస్తున్నాయి.అయితే, ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది మరణించిన తరువాత ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలో స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ రాజీనామా డిమాండ్‌ అనవసరమంటూ కొట్టిపారేశారు. ఈ క్లిష్టసమయంలో అశ్వినీ వైష్ణవ్‌ నిర్విరామంగా పనిచేశారు. మంత్రి మంచి పనితీరు చూపారు. ఈ సమయంలో ఆయన రాజీనామా కోరడం తెలివైన పని కాదంటూ దేవగౌడ పేర్కొన్నారుఅలాగే దేశంలోని ప్రతిపక్షాల తీరును సైతం విమర్శించారు.. ఈ దేశ రాజకీయాల గురించి విశ్లేషించగలను. కానీ ఏం లాభం? బీజేపీ సంబంధాలు లేని ఒక్కపార్టీని చూపించండి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉన్నాయి.. అలాలేని పార్టీని చూపించండి. అప్పడు సమాధానం చెప్తా.. అంటూ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీలను కూడగట్టేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ చేస్తోన్న ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అయితే, ఈ పరిణామాలను గమనిస్తుంటే.. బీజేపీకి జేడీఎస్‌ దగ్గరవుతున్నట్టు కనిపిస్తుందని తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *