కేసీఆర్‌ కాంగ్రెస్‌..వయా కేవీపీ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలంటూ చేసిన విన్యాసం కేంద్రంతో సంబంధాలను తెగేదాకా లాగేసిందా? ఇక ఇప్పుడు జాతీయ రాజకీయాల సంగతి దేవుడెరుగు సొంత రాష్ట్రంలో నిలవడమెలా అన్న ఆందోళనలో కేసీఆర్‌ ఉన్నారా? ఆయన తాజా ఢల్లీి పర్యటన రాష్ట్రంలో తనకు మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్‌ ను ఆశ్రయించడానికేనా? ఈ ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం చెబుతున్నారు.కేసీఆర్‌ ఢల్లీి పర్యటనకు ముందు.. ఢల్లీి చేరిన తరువాత కూడా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కేవీపీతో టచ్‌ లోకి వెళ్లారని అంటున్నారు. రాష్ట్రంలోనైనా, జాతీయ స్థాయిలోనైనా తనను ఇప్పుడు ఆదుకుని ఒడ్డున పడేయగల పార్టీ కాంగ్రెస్సేనని కేసీఆర్‌ నమ్ముతున్నారని తెరాసలో ఆయనతో సన్నిహితంగా మెలిగే నేతలు అంటున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్‌ కు పార్టీని చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నారనీ, ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసే పనిలోనే ఆయన తాజా హస్తిన పర్యటన అనీ అంటున్నారు. తనంత తానుగా కాంగ్రెస్‌ కు చేరవ అవ్వడానికి గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్న సంగతి విదితమే.తెరాసను కాంగ్రెస్‌ లో విలీనం చేస్తానన్న ప్రతిపాదనను కూడా ఆయన ఒక మధ్య వర్తి ద్వారా సోనియాకు చేసినట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌ అధినేత్రి అందుకు ససేమిరా అన్నారని అంటున్నారు. ఆ తరువాత కొద్ది కాలం సైలెంట్‌ గా ఉన్న కేసీఆర్‌ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా చురుకుగా వ్యవహరించారనీ, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు బేషరతుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, యశ్వంత్‌ సిన్హాను తెలంగాణకు ఆహ్వానించి రాచమర్యాదలు చేయడమే కాకుండా భారీ ర్యాలీ నిర్వహించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి హఠాత్తుగా హస్తిన పర్యటన చేపట్టడంతోనే కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేశారు.ఇటీవలి కాలంలో ఆయన ఒక్కసారంటే ఒక్క సారి కూడా ప్రధానితో భేటీ కాకపోవడం.. ఆయన పలు సందర్భాలలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కనీసం ప్రొటోకాల్‌ ను కూడా పాటించకుండా ఆయనకు ఆహ్వానం, వీడ్కోలు పలకకుండా దూరంగా ఉండిపోవడం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ తెరాసను దీటుగా ఎదుర్కొంటున్న క్రమంలో కేసీఆర్‌ వ్యూహాత్మకంగా తన విమర్శలకు టార్గెట్‌ గా ప్రధాని మోడీని ఎంచుకోవడంతో బీజేపీతోనూ, మోడీతోనూ పూడ్చడానికి వీల్లేనంతగా అగాధం పెరిగిందని తెరాస వర్గాలే చెబుతున్నాయి. రాజకీయంగా వైరి పక్షాలైనప్పటికీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతగా ప్రధానిపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగిన సందర్భంగా గతంలో ఎన్నడూ లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెలంగాణపై దృష్టి సారించిందనీ, పరిమితులకు మించిన అప్పులు, కాళేశ్వరం జాతీయ హోదా అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను, అవకతవకలను ఏకంగా పార్లమెంటు సాక్షిగానే వెల్లడిరచిందని అంటున్నారు.కాగా ఇంత కాలం కేంద్రం విమర్శలను, అప్పులు కేటాయింపుల విషయంలో కేంద్రాన్ని దీటుగా ఎదుర్కొన్న కేసీఆర్‌ ఇటీవలి వరదలలో కాళేశ్వరం పంప్‌ హౌస్‌ లు నీట మునిగి, ప్రాజెక్టు లోపాలు బహిర్గతం కావడంతో డిఫెన్స లో పడ్డారని అంటున్నారు. దీంతో కేంద్రానికి చేరువ కావడానికి, రాజీపడటానికి అవకాశాలన్నీ మూసుకు పోయిన తరుణంలో ఆయనకు కనిపిస్తున్న ఏకైక హోప్‌ కాంగ్రెస్సేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ కు చేరువ కావడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆయన రెండు చేతులతో అందుకోవడానికి చేయని ప్రయత్నం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ భవన్‌ వద్ద విపక్షాలతో ధర్నాకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన సందర్భంలో అన్ని పార్టీల కంటే ముందుగా గాంధీ భవన్‌ కు ప్లకార్డులతో చేరుకున్నది తెరాస ఎంపీలే. అలాగే సోనియా గాంధీ ఈడీ విచారణ కోసం వెళ్లినప్పుడు నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నది కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలే. ఆందోళనా కార్యక్రమాలపై చర్చించేందుకు పార్లమెంటు ఆవరణలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో విపక్షాల సమావేశానికి కూడా తెరాస హాజరైంది.సోనియాను ఈడీ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్‌ కు సంఫీు భావం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ హస్తిన పర్యటన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటులో తెరాస ఎంపీలు కాంగ్రెస్‌ తో కలిసి వివిధ అంశాలపై పోరాడాలని ఇప్పటికే కేసీఆర్‌ వారికి దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే హస్తిన పర్యటనకు ముందు ఆయన కేవీపీతో పలు మార్లు సంభాషించారనీ, ఒక అడుగు తాను వెనక్కు వేయడానికి సిద్ధంగా ఉన్నాననీ, కాంగ్రెస్‌ తో జట్టు కట్టేందుకు రెడీగా ఉన్నాననీ ఆయన కేవీపీకి చెప్పినట్లు తెలుస్తోంది. కేవీపీ ద్వారా ఆయన తన హస్తిన పర్యటనలో కాంగ్రెస్‌ అగ్ర నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. హస్తిన చేరిన తరువాత కూడా ఈ విషయంపై ఆయన కేవీపీతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్‌ కాంగ్రెస్‌ తో సయోధ్యకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారని చెబుతున్నారు. ఇటు తెలంగాణలో తెరాస మరోసారి అధికారంలోకి రావాలన్నా.. అటు జాతీయ స్థాయిలో తన ఉనికిని కాపాడుకోవాలన్నా కాంగ్రెస్‌ స్నేహం అనివార్యమని కేసీఆర్‌ విశ్వసిస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కేసీఆర్‌ హస్తిన పర్యటనలో హస్తం పార్టీకి తెరాసను చేరువ చేసే కేసీఆర్‌ యత్రాలకు సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయనకు కేవీపీ భరోసా ఇచ్చారనీ చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *