ఎట్టకేలకు పోర్టుకు మోక్షం

దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం తెరపైకి వచ్చి. భావనపాడు పోర్టు పేరుతో జిల్లావాసులను ఊరించినా.. తాజా మూలపేట పోర్టుగా పేరు మార్చుకుని శంకుస్థాపన పూర్తి చేసుకుంది. జిల్లాలో పోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రతి పాదనపై ఎన్నికల సమయంలోనే నాయకులకు ప్రేమ పుట్టు కొస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఏడాదిలో దీన్ని ఏదోవిధంగా తెరపైకి తేవడం, హావిూలు గుప్పించడం.. అధికారంలోకి వచ్చాక ఒకటీ అరా పనులు చేసి మూలన పడేయడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.1978లో మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తొలిసారి ప్రతిపాదించిన ఈ పోర్టు వైపు మళ్లీ 1989 అక్టోబర్‌ వరకు ఎవరూ కన్నెత్తి చూడలేదు. ఇదే ఏడాది డిసెంబరులో ఎన్నికలు రావ డంతో అక్టోబరులో నిధులు విదిలించారు. 1983లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కదలిక వచ్చినా ఫలితం కనిపించలేదు. మళ్లీ 2019 ఎన్నికల ముందు చంద్రబాబు పోర్టు అంశాన్ని తెరపైకి తెచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు .. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం భావనపాడు పోర్టును మూలపేట పోర్టుగా మార్చి బుధవారం సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా దీన్ని ఎన్ని కల స్టంట్‌ గా మిగిల్చేస్తారో.. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారో చూడాలి. అయితే గతంతో పోలిస్తే నిర్మాణ వ్యయం, పరిధి, నష్టాలు తగ్గడంతో నిర్మాణానికి మార్గం సుగమమైనట్లే ఉంది. ప్రస్తుతం మూలపేటకు మారిన భావనపాడు గ్రీన్ఫీల్డ్‌ పోర్టు జిల్లావాసుల నాలుగున్నరదశాబ్దాల కల. రూ.13.48 కోట్ల అంచనా వ్యయం తో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి 1978 అక్టోబరు 13న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ప్రకారం 1980 బడ్జెట్‌ లో తొలిసారి రూ.1.81 కోట్లు మంజూరు చేశారు. 1988 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. సుమారు 27 సర్వేలు నిర్వహించినా పోర్టుకు మోక్షం కలగలేదు. 1983 మే 31న హార్బర్‌ రక్షణకు రూ. 52.65 లక్షలతో సముద్రంలో రాతిగోడల నిర్మాణానికి సాంకేతిక అనుమతి లభించింది.ఉత్తరం వైపు 747 విూటర్లు, దక్షిణ వైపు 542 విూటర్ల పొడవున గోడలు కట్టి మధ్యలో ఇసుక తవ్వి మూడు దశల్లో పోర్టు నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించారు. ఒకటో దశలో 415 విూటర్ల పొడవు, 2 విూటర్ల లోతు, రెండో దశలో 145 విూటర్ల పొడవు, మూడో దశలో సముద్ర ముఖద్వారం వద్ద 320 విూటర్ల పొడవు, 3 విూటర్ల లోతులో మొత్తం 50 విూటర్ల వెడల్పు, 1180 విూటర్ల పొడవున నిర్మించ డానికి టెండర్లు పిలిచారు. ఆ మేరకు 1989 ఏప్రిల్‌ నాటికి గోడల నిర్మాణం పూర్తయింది. అయితే పూర్తి స్థాయిలో డ్రెడ్జింగ్‌ జరపకుండా 1015 విూటర్ల కాలువ మాత్రమే త్వ 1988 జనవరి 6న సముద్రంతో అను సంధానించారు. దాంతో అలల తాకిడికి హార్బర్‌ ముఖ ద్వారం మళ్లీ ఇసుకతో మూసుకుపోయింది. ఆ తర్వాత 69,900 క్యూబిక్‌ విూటర్ల ఇసుక తవ్వినా ఫలితం దక్కలేదు. సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చి స్టేషన్‌ సలహాతో 1989 ఫిబ్రవరిలో శాస్త్రవేత్తల బృందం కొన్ని సూచనలు చేస్తూ ఒక నివేదిక ఇచ్చింది. ఆ ప్రకారం దక్షిణ గోడను రూ.4.12 కోట్లతో 60 విూటర్ల మేరకు పొడిగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.కాగా, 1978లో రూ.13.48 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని 199 నవంబరులో రూ.15 కోట్లకు పెంచి 1991 మార్చినాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే నామమాత్రంగా నిధులు విదల్చడంతో పనులు ముందుకు సాగలేదు. 2004 అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సాంకేతిక కారణాలతో చేతులెత్తేసింది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో ఎన్నికల నోటిఫికేషన్‌ కు ముందు శంకుస్థాపనకు ప్రయత్నాలు చేసి వెనకడుగు వేశారు. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పోర్టు నిర్మాణానికి 14 వేల ఎకరాలు సేకరించాలని తీసుకున్న నిర్ణయం ఆ ప్రాంతవాసులను అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడదీసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రతిపక్షనేతగా ప్రజా సంకల్పయాత్ర సమయంలో ఇచ్చిన హావిూ మేరకు ప్రైవేట్‌ యాజమాన్యంలో పోర్టు నిర్మించనున్నట్టు ప్రకటించారు.గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో, ఆ తర్వాత మళ్లీ ఎన్నికల ముందు హడావుడి చేసింది. పోర్టుకు 14 వేల ఎకరాలు సేకరించాలని 2015 సెప్టెంబరులో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 2018లో 4,178 ఎకరాలతో నిర్మించాలని ప్రయత్నించారు. దానికి అనుగుణంగా 2019 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నోటిఫికేషన్లు జారీ చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోర్టు మొదటి దశ పనులు 36 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్టు 2020లో ప్రకటించింది. మొదటి విడతలో మూడు సాధారణ కార్గో బెర్తులు, ఒక బల్క్‌ కార్గో బెర్త్‌ తోపాటు 500 ఎకరాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రూ.3,670 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారైందని, ఆర్థికశాఖ నుంచి అనుమతి రాగానే టెండర్లు పిలవనున్నట్లు ఏపీ మారిటైమ్‌ బోర్డు 2021 జూలైలో ప్రకటించింది. తొలి దశలో రూ.4,361.91 కోట్లతో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టులో అనుమతి మంజూరు చేసింది. ఆ మేరకు రైట్స్‌ సంస్థ రూపొం దించిన సవరించిన ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించింది. భావనపాడు పోర్ట్‌ డెవలప్మెంట్‌ కార్పొ రేషన్‌ లిమిటెడ్‌ ఈ పోర్టును అభివృద్ధి చేయనుండగా, ఏపీ మారిటైమ్‌ బోర్డు పర్యవేక్షిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. పోర్టు నిర్మాణానికి నిధులు సవిూకరణ లో భాగంగా రూ.3,053.34 కోట్ల రుణం తీసుకోవడా నికి ఏపీ మారిటైమ్‌ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.మొదట ప్రతిపాదించిన భావనపాడు వద్ద పోర్టు నిర్మా ణానికి భౌగోళిక, సాగర గర్భంలో పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయి. ఇక్కడ సముద్రం లోతు పోర్టు నిర్మాణానికి అనుకూలంగా లేదని నిపుణులు తేల్చారు. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఇసుక మేటలు వేసి దిబ్బలుగా పేరుకుపోతుంటుంది. దాంతో నౌకలు బెర్త్‌ పైకి రావడానికి వీలుపడదు. ఈ కారణాలే పోర్టు నిర్మాణంలో జాప్యానికి మరో ప్రధాన కారణంగా నిలిచాయి. వీటిని ఎలా అధిగమించాలన్న దానిపై పలు సంస్థలు ఎన్నో అధ్యయనాలు జరిపాయి. ఇసుక మేట లను అడ్డుకోవడానికే ఎన్టీఆర్‌ హయాంలో రక్షణ గోడలు కూడా నిర్మించారు. కానీ ఫలితం లేకపోవడంతో చివరికి నిర్మాణ ప్రాంతాన్ని మార్చడంతోపాటు పరిధి తగ్గిస్తేతప్ప సాధ్యం కాదని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.సవరించిన డీపీఆర్‌ ప్రకారం వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ, కొమరల్తాడ, కొత్తపేటలను తప్పించి సంతబొమ్మాళి మండలం భావన పాడుకే పరిమితం చేస్తున్నట్టు ప్రకటించారు. 2,363 ఎకరాల భూమిని సేకరించాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించి టీడీపీ హయాంలో జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ ను వెనక్కు తీసుకుంటూ 2021 నవంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని మూల పేట, విష్ణుచక్రం పరిధిలోకి మార్చుతున్నట్టు గత ఆగస్టులో ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా పోర్టు పేరును మూలపేట పోర్టుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మొదటి దశ నిర్మాణాన్ని 1010 ఎకరాల నుంచి 675.60 ఎకరాలకు కుదించి భూ సేకరణ చేపట్టారు. పోర్టు కోసం గ్రామాన్ని, భూములను త్యాగం చేసినం దున తమ గ్రామం పేరునే పోర్టుకు పెట్టాలని మూలపేట వాసులు విన్నపం మేరకు ప్రభుత్వం పేరు మార్చింది. 2022 ఆగస్టులో జారీచేసిన ఉత్తర్వుల మేరకు గత ఏడాది నవంబరు 3న మూలపేట రైతులతో సమావేశం నిర్వహించి ఎకరాకు రూ.18 నుంచి రూ.25 లక్షలకు పెంచి పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం తో రైతులు అంగీకరించారు. నిర్వాసితులకు ప్రత్యేకంగా పునరావాస కాలనీ కోసం కస్పా నౌపడలో ఎకరా రూ. 26 లక్షలు వెచ్చించి భూమి కొనుగోలు చేశారు. మొత్తంగా భావనపాడు పోర్టు కోసం 675.60 ఎకరా లను సేకరించింది. ఇందులో ప్రైవేటు భూములు 433.71 ఎకరాలు కాగా, తీర ప్రాంతంతో కలిపి 241.89 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.రూ.3200 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుకు ఈ నెల 19న శంకుస్థాపన చేసేందుకు మూహూర్తం నిర్ణయించారు. ఫేజ్‌`1 పనులను విశ్వ సముద్ర గ్రూప్‌ దక్కించుకుంది. టెక్కలి మండలం బూరగాంలో 32.78 ఎకరాలు, పాత నౌపడలో 5.50 ఎకరాలు, కొండ భీంపురంలో 5.69 ఎకరాలు, నందిగాం మండలం దిమిలాడలో 21.17 ఎకరాలు, నర్సిపురంలో 12.15 ఎకరాలు, దేవలభద్ర లో 3.56 ఎకరాలు, సంతబొమ్మాళి మండలం మర్రి పాడులో 27.38 ఎకరాలు, కస్పా నౌపడలో 5.17 ఎకరాలు, రాజపురంలో 320.31 ఎకరాల సేకరణ సేకరించిన భూముల్లో రోడ్డు కనెక్టివిటీ కోసం 327.15 ఎకరాల కోసం ఇప్పటికే రైతులతో సంప్రదింపులు పూర్తిచేశారు. రైల్వే కనెక్టివిటీ కోసం 100.27 ఎకరాలు, మిగతాది పోర్టు కోసం వినియోగించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *