జగన్‌ బాటలో కేసీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 18
ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడం ద్వారా తెలంగాణలో కేసీయార్‌ సమర శంఖాన్ని పూరించారు. భారీ స్థాయిలో హావిూలు లేకపోయినా వృద్ధులు, వితంతువులకు దశల వారీగా పెన్షన్‌ పెంచడం, పేదలందరికీ బీమా సౌకర్యం కల్పించడం, 2004 సెప్టెంబర్‌ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్థానంలో పాత పెన్షన్‌ విధానం తీసుకురావడానికి కమిటీని ఏర్పాటు చేయడం, ఓపెన్‌ కేటగిరీ విద్యార్థులకు జిల్లాకు ఓ గురుకుల పాఠశాల ఏర్పాటు, దళిత బంధు కొనసాగించడం వంటివి కీలకమైన విషయాలపై విధాన నిర్ణయాలు ప్రకటించారు. కేసీయార్‌ హావిూల వల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వ ఖజానాపై పెద్దగా ప్రభావం ఉండదు తెలంగాణలో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో చూసిన తర్వాత భారాస మ్యానిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హావిూల విషయంలో కేసీయార్‌ కొంచెం ఆచితూచి వ్యవహరించారనే చెప్పాలి. సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం, ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ పెంపుదల, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంలాంటివన్నీ ఇప్పటికే ఆచరణలోకి వచ్చాయి కాబట్టి, కేసీయార్‌ ఆచరణ సాధ్యం కాని హావిూల జోలికి వెళ్లలేదు. ఓ రకంగా చెప్పాలంటే కాస్త బాధ్యతగానే వ్యవహరించారు. కేసీఆర్‌ తెలుగు రాజకీయాల్లో సీనియర్‌ మోస్ట్‌ నాయకుడైన కేసీయార్‌… జగన్‌ మార్గంలోనే నడుస్తున్నారని చెప్పక తప్పదు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామనే జగన్‌ హావిూతో కేసీయార్‌ విభేదించారు. కార్పొరేషన్‌ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపడం సాధ్యం కాదని చెప్పారు. కానీ ఈ ఎన్నికల ముందు జగన్‌ను ఆయన అనుసరించారు. దశలవారీగా పెన్షన్ల పెంపును కూడా జగన్‌ నుంచే కాపీ కొట్టారు. ఈ విషయాన్ని కేసీయార్‌ స్వయంగా చెబుతూ జగన్‌ను అభినందించారు. తాము కూడా దశలవారీగా పెన్షన్లు పెంచుతామని చెప్పారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి అక్కడి సామాజిక పెన్షన్లు తలా ఒక్కరికి ఐదు వేల రూపాయలకు చేరుతాయి. కాంగ్రెస్‌ మాత్రం గెలవగానే నాలుగు వేలు ఇస్తామని చెబుతోంది. ఇక లబ్ధిదారులు ఎవరికి ఓటేస్తారో చూడాలి. పాత పెన్షన్‌ పద్ధతిని కూడా కేసీయార్‌ వ్యతిరేకించారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన సీపీఎస్‌ ఉద్యోగులకు కాస్త ఆశ కల్పించారు. బహుశా తర్వాత కాలంలో వాళ్లకు కూడా ఆంధ్రప్రదేశ్‌లాగే గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను ప్రకటిస్తారేమో చూడాలి. ఎందుకుంటే ఏపీ కొత్త పెన్షన్‌ విధానం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాల్లో ఇదే పద్ధతిని అనుసరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ‘తెలుగు పోస్ట్‌’ గతంలో చెప్పినట్లు రామ్‌ చరణ్‌ కాదు… జగన్‌మోహన్‌ రెడ్డే గేమ్‌ ఛేంజర్‌!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *