పథకాలకు పవన్‌ ఓటు

రాజమండ్రి, ఆగస్టు 18
ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన బద్ధ విరోధి పవన్‌ కళ్యాణ్‌ సమర్థిస్తున్నారా? అంటే అవుననే జవాబు రాక తప్పదు.’’జగన్‌ ఓడితే పథకాలేం ఆగిపోవు.మరిన్ని అదనంగా అమలు చేస్తాం’’ అని జనసేనాని వ్యాఖ్యల అంతరార్ధం ఏమిటి?జగన్‌ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని,ప్రజలకు ఆ పథకాల వలన మేలు జరుగుతోందని పవన్‌,చంద్రబాబు నిర్ధారణకు వస్తున్నట్లే కదా! ఇందులో మొహమాటం ఏమున్నది?ప్రభుత్వం మళ్ళీ రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోతాయని వైసీపీ నాయకత్వం ప్రచారం చేయడం సహజం.సంక్షేమ కార్యక్రమాలను కవచకుండలాలుగా జగన్‌ మలచుకున్నారన్న సంగతి ఆలస్యంగా అయినా టీడీపీ,జనసేన గుర్తిస్తున్నవి. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టలేక టిడిపి,జనసేన సతమతమవుతున్నవి.’’ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ గెలవకపోతే పథకాలు ఆగిపోతాయేమో, సంక్షేమం నిలిచిపోతుందేమో అనుకోవద్దు.ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు ఉంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలను అమలు చేస్తాం’’ అని పవన్‌ కళ్యాణ్‌ సంక్షేమ లబ్దిదారులకు హావిూ ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.జనాభాలో 89 శాతానికి సంక్షేమ ఫలాలు అందుతున్నవి. వాటికి వ్యతిరేకంగా మాట్లాడితే కొంప మునుగుతుందని చంద్రబాబు,పవన్‌ లకు తెలుసు.అందుకే ఇద్దరు నాయకులు కూడా సంక్షేమ పథకాలను విమర్శించే సాహసానికి ఒడిగట్టడం లేదు ‘’మళ్లీ జగన్‌ వస్తే మేం ఇక్కడి నుంచి పారిపోతాం,ఉండలేం అని నాకు చెప్పుకొని బాధపడేవారే ఎక్కువ కనిపిస్తున్నారు’’ అని పవన్‌ అన్నారు.’’వ్యాపారులు,పారిశ్రామికవేత్తలు,డాక్టర్లు బతకడానికి భయపడే పరిస్థితులు వచ్చేస్తాయని మధనపడుతున్నారు’’ అని కూడా ఆయన చెప్పారు.ఇది నమ్మశక్యంగా ఉందా? జగన్‌ ను క్రూరునిగా,కర్కోటకునిగా,నియంతగా చిత్రీకరించడంలో భాగంగానే పవన్‌ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు భావించాలి.జగన్‌ వలన నష్టపోతున్నవారు,లేదా ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే పారిపోతామనే వాళ్లకు కోర్టులు,పోలీసులు… ఇతర వ్యవస్థలు కనిపించడం లేదా? ఆయా వ్యవస్థలను ఆశ్రయించి తమ గోడు చెప్పుకోవచ్చు.న్యాయపోరాటం చేయవచ్చు.రాష్ట్రాన్ని వదిలి పారిపోవాలని అనుకోడం ఏమిటి?ఇక బతకడం కష్టమని భావించడం ఏమిటి ఎక్కడికి పారిపోకుండానే జన రాజ్యం తెచ్చుకుందాం’’ అన్నది పవన్‌ ముగింపు పలుకు.జన రాజ్యం ఏమిటి? ప్రజా రాజ్యమే కదా! ప్రజా పాలనే కదా! జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకున్న పరిమిత ఆదాయ వనరులతోనే నాలుగున్నరేళ్లుగా బండిని నెట్టుకు వస్తున్నారు.పవన్‌ లేదా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇంతకన్నా అద్భుతమైన పరిపాలన ఎట్లా ఉంటుందో దాని నమూనా ప్రజలకు వివరించి వారిని ఒప్పించి అధికారంలోకి రావచ్చు.జగన్‌ క్రిమినల్‌ అనీ,నారా రూప రాక్షసుడనీ నిందించినంత మాత్రాన ఆయనను ప్రజల నుంచి దూరం చేయలేరు.ప్రజల ద్రుష్టిలో దోషిగా నిలబెట్టడమూ సాధ్యం కాదు. ‘’తాడేపల్లిలో సీఎం నివాసం ఉండే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే నేరాల రేటు ఎక్కువగా ఉంద’’ని పవన్‌ ఆరోపించడం అర్ధం లేనిది.ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతాల్లో నేరాలు జరగకూడదన్న హావిూ ఎవరూ ఇవ్వలేరు.ముఖ్యమంత్రే స్వయంగా తాను నివిసిస్తున్న ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌ లో ఎస్‌.ఐ.గా కూడా పనిచేయాలేమో తెలియదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *