ఆయుషిని తండ్రే చంపేశాడు: హత్యకేసులో వీడిన మిస్టరీ

మథురలోని యమున ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో గతవారం సూట్‌కేసులో కనిపించిన 25 ఏళ్ల యువతి మృతదేహం కేసు మిస్టరీ వీడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ (Shraddha Walker) హత్యకేసు ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే సూట్‌కేసులో యువతి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రే ఆమెను తన తుపాకితో కాల్చి చంపినట్టు తేలింది. రోజూ రాత్రిళ్లు ఇంటికి ఆలస్యంగా రావడం, వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న అనుమానంతో తానే ఆమెను హత్య చేసినట్టు విచారణలో ఆమె తండ్రి అంగీకరించాడు. నిందితులైన బాధిత యువతి తల్లిదండ్రులిద్దరినీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఆయుషి చౌదరి(Aayushi Chaudhary) తరచూ ఇంట్లోంచి బయటకు వెళ్లి రాత్రిళ్లు పొద్దుపోయాక ఇంటికి తిరిగి వచ్చేది. పద్ధతి మార్చుకోవాలని తండ్రి నితీశ్ యాదవ్ ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోలేదు సరికదా, మరింత మొండిగా వ్యవహరించేది. దీనికి తోడు తమకు తెలియకుండా ఆమె వేరే కులానికి చెందిన ఛత్రపాల్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్టు తల్లిదండ్రులు అనుమానించారు.

కుమార్తె ప్రవర్తనపై ఆగ్రహంతో రగిలిపోయిన తండ్రి తన లైసెన్స్‌డ్ తుపాకితో ఆమెను కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి మథుర (Mathura) తీసుకెళ్లి యమున ఎక్స్‌ప్రెస్ వే (Yamuna Expressway) సమీపంలో పడేశాడు. రోడ్డు పక్కన పడి ఉన్న సూట్‌కేసును గుర్తించిన కూలీలు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహం తల, ముఖం భాగం రక్తంతో తడిసిపోవడం, ఒళ్లంతా గాయాలు ఉండడంతో తొలుత ఆమెపై దాడిచేసి ఆపై కాల్చి చంపి ఉంటారని పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమెను ఆయుషిగా గుర్తించారు. ఈ క్రమంలో ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం కక్కేశాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *