షిండే ఎఫెక్ట్‌…. అసంతృప్తులతో కేటీఆర్‌..

అనుభవం అయితేనే గానీ, తత్త్వం బోధపడదంటారు. నిజం. రాజకీయాలలో ఉన్నవారికి, ముఖ్యంగా, చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బాపతు రాజకీయ నాయకులలో అహంకారం అనేది, అలా అతుక్కుని ఉంటుంది. రాహుల్‌ గాంధీ నుంచి కేటీఆర్‌ వరకు, చాలా మందిలో ఆ అవలక్షణం, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో, బయటపడుతూనే ఉంటుంది. కనిపిస్తూనే ఉంటుంది. ఒకప్పడు, మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న రోజుల్లో రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన ఆర్డినెన్సు కాపీని విలేకరుల సమావేశంలో, చించి పోగులు పెట్టారు. అహంకారాన్ని ప్రదర్శించారు. అది కూడా, ప్రధాని విదేశాల్లో ఉన్న సమయంలో గాంధీ నెహ్రుల వారసుడు రాహుల్‌ గాంధీ ప్రధానిని, మొత్తం మంత్రివర్గాన్ని,చివరాఖరకు ఆర్డినెన్సుకు మోద ముద్ర వేసిన అప్పటి రాష్ట్రపతిని అవమాన పరిచే విధంగా, తమ అహంకారాన్ని ప్రదర్శించారు. నిజమే, న్యాయస్థానాలలో శిక్ష పడిన ప్రజాప్రతి నిధులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సు, రాహుల్‌ గాంధీ అన్నట్లుగానే ఒక పనికి మాలిన ఆర్డినెన్సు, ఆయినా, అధికార కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్న ఆయన తమ అభిప్రాయాన్ని, నేరుగా ప్రభుత్వానికి వివరించే అవకాశం ఉన్నా, విలేకరుల సమావేశంలో ఆర్డినెన్సు పత్రాలు చించేసి, ఇదంతా పనికిమాలిన చెత్తని విమర్శలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనంగానే నిలిచింది. అలాగే, రాహుల్‌ గాంధీ, నిర్లక్ష్య ధోరణి కారణంగానే అస్సాం ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్‌ బిశ్వ శర్మ సహా అనేక మంది సీనియర్‌ నాయకులు, కాంగ్రెస్‌ ను వదిలి బీజేపీలో,ఇతర పార్టీలలో చేరారు. ఒక్క రాహుల్‌ గాంధీ మాత్రమే కాదు, ప్రాంతీయ, కుటుంబ పార్టీల పుత్ర రత్నాలు చాలా మందిలో ఈ దురహంకార ధోరణి కనిపిస్తుంది, నిన్నగాక మొన్న, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్న శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే పతనానానికి, పార్టీలో తిరుగుబాటుకు ఇంకా అనేక కారాణాలు ఉన్నా ఆయన ముఖ్యమంత్రిగా ప్రదర్శించిన అహంకార ధోరణి కూడాడా ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడు, మంత్రి కేటీఅర్‌ విషయం అయితే చెప్పనక్కరలేదని పార్టీ నాయకులే చెపుతారు. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ లోనూ దొరతనం అహంకార లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిూ రహస్యం కాదు. ఇక కేటీఆర్‌ అయితే, ముందు అహంకారం పుట్టి తర్వాత ఆయన పుట్టారని అంటారు. అయితే ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి, కొంత కాలం క్రితం వరకు, కేటీఆర్‌ కొంత హుందాగానే వ్యవహరించారు. కానీ, ఎందుకో ఏమో కానీ, ఈ మధ్య కాలంలో కేసీఆర్‌ నోట్లోనుంచి ఊడి పడ్డారా, అన్నట్లుగా మాటకు పదును పెట్టారు.భాష విషయంలో కేసీఆర్‌ ని మించిపోయారు. అలాగే అంతకు ముందునుంచే పార్టీపై పట్టు పెంచుకునే క్రమమలో ఆయన, కొందరు సీనియర్‌ నాయకులను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టారు. అందులో కొందరు, పార్టీకి గుడ్‌ బై చెప్పారు. అయితే, ఇప్పడు మళ్ళీ కేటీఆర్‌ దూరమైన వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా, మహారాష్ట్ర పరిణామాలు, ఆ వెంటనే, బీజేపీ ఇతర పార్టీల నుంచి సీనియర్‌ నాయకులను ఆకర్షించేందుకు ఏకంగా, ఒక కమిటీనే వేసింది. అంతే కాదు కమిటీ సారథ్య బాధ్యతలను ఇంచుమించుగా 20 ఏళ్ళు కేసీఆర్‌ వెంట ఉన్న, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కు, తెరాస మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి అప్పగించింది.కేటీఆర్‌ గతంలో తన్ని తగలేసిన నాయకులతో ఇప్పడు సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. గతంలో అలాంటి కేటీఆర్‌ బాధిత నేతలు ఎక్కడైనా అనుకోకుండా తారస పడినా కేటీఆర్‌ మొహం తిప్పుకుని వెళ్లి పోయేవారు, ఇప్పడు వారు మొహం తిప్పుకున్నా తానే వెళ్లి పలకరిస్తున్నారు.పార్టీ వ్యవహారాల్లో తన మాట వినకుండా దూరంగా ఉన్న వారిని.. పార్టీ వీడి పోయిన వారిని కూడా ఇప్పుడు ఆయన ఫ్రెండ్లీగా పలకరిస్తున్నారు. ఇటీవల పార్టీలో రెబెల్‌ టోన్‌ వినిపిస్తున్న,కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లి మరీ పలకరించారు. అంతకు ముందు, సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తెరాస తీర్థం పుచ్చుకున్న నేపధ్యంలో అదే జూపల్లిని కేటీఆర్‌ చులకనగా చూశారు. ఇప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్న సమయంలో ఇటికి వెళ్లి రాజకీయాలు చర్చించారు.తాజాగా ఒక కార్యక్రమమలో తారస పడిన, మాజీ ఎంపీ వివేక్‌ ను కేటీఆర్‌ ఆత్మీయంగా పలకరించారు. పక్కకు తీసుకుపోయి మరీ ముచ్చట్లు పెట్టారు. అయితే కేటీఆర్‌ కారణంగానే వివేక్‌ తెరాసను వదిలి బీజేపీలో చేరారు. వివేక్‌ సిట్టింగ్‌ సీటు పెద్ద పల్లి టిక్కెట్‌ను ఆయనకు కాదని, తమ అనుచరుడు బాల్క సుమన్‌ కు ఇవ్వడంతో వివేక్‌ తెరాస వదిలి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఈటల సారథ్యంలోని, చేరికల కమిటీలో సభ్యుడిగా,చురుగ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయనతో కేటీఆర్‌ ముచ్చట్లు పెట్టడం వెనక ఎలాంటి వ్యూహం ఉందనేది పక్కన పెడితే, తండ్రీ కొడుకులు ఇద్దరికీ షిండే షాక్‌ గట్టిగానే తగిలిందని, రాజకీయవర్గాలు భావిస్తున్నాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *