కొడంగల్‌ నుంచా..ఎల్‌ బీ నగరా…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంకా ఎన్నికలకు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఆరు నెలల్లోపు అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తుంది. ముందుగానే ప్రజల్లోకి వెళ్లడం వల్ల కొంత సానుకూలత ఏర్పడుతుందని ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సయితం నివేదిక అందించారు. గెలుపు గుర్రాల కోసం ఆయన సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పోటీ ఖాయంగా కనిపిస్తుంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో… నిజానికి రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌ నుంచి పోటీ చేస్తారని నిన్న మొన్నటి వరకూ అనుకునే వారు. 2009, 2014లో రేవంత్‌ రెడ్డి అక్కడి నుంచే గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. కొడంగల్‌ నియోజకవర్గం రేవంత్‌ కు పెట్టని కోట.. కొడంగల్‌ నుంచి ఈసారి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల కొడంగల్‌ లో ముఖ్యనేత గుర్‌నాథ్‌ రెడ్డిని కాంగ్రెస్‌ లోకి తీసుకువచ్చారు. గుర్‌నాథ్‌ రెడ్డి సీనియర్‌ నేత. గతంలో ఐదు సార్లు కొడంగల్‌ నుంచి గెలిచిన నేత. ఇదే తనకు చివరి ఛాన్స్‌ అని ప్రజల ముందుకు ఆయన వెళుతున్నారు. ఆయన వైఎస్సార్టీపీలోకి వెళతారనుకున్నా ఎందుకో మళ్లీ ఆగిపోయారు. తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. ఆయనే కొడంగల్‌ టిక్కెట్‌ ఇచ్చేందుకు రేవంత్‌ రెడ్డి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. తాను అవసరమైతే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన ఎల్బీనగర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇతర జిల్లాల ప్రజలతో పాటు సెటిలర్లు ఎక్కువగా ఉండటం తనకు కలసి వచ్చే అంశంగా రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. ఎల్బీనగర్‌ అయితే సులువుగా గెలిచే అవకాశముందని సర్వే రిపోర్టులు కూడా అందాయని చెబుతున్నారు. కొడంగల్‌ అయితే కొంత కష్టపడాల్సి ఉంది. అంతేకాకుండా పీసీసీ చీఫ్‌ గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండటంతో కొడంగల్‌ అయితే ఇబ్బంది ఎదురువుతుందని భావించి రేవంత్‌ తన మనసు మార్చుకున్నారని చెబుతున్నారు. రేవంత్‌ ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *