అందరి చూపు ఖమ్మం వైపే

తెలంగాణ రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్‌ది మరో తీరు. అన్ని పార్టీల సమాహారంగా ఉంటుంది జిల్లా రాజకీయ ముఖచిత్రం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కీలక విపక్ష నేతలను గెలిపించిన చరిత్ర ఉంది.. ఆ చరిత్ర 2018 వరకు కొనసాగింది కూడా. తొలుత ఈ జిల్లాలో ఎర్రజెండాలదే హవా. తర్వాత కాంగ్రెస్‌ బలం పెరిగింది. ఎన్టీఆర్‌ టీడీపీ పెట్టాక సవిూకరణాలు మారాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినా.. గత రెండు ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చినా.. అధికారపక్షానికి మాత్రం జిల్లా చిక్కలేదు. రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక్కో సీటే గెల్చుకుంది గులాబీపార్టీ. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గణనీయంగానే సీట్లు సంపాదించింది. 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నా.. అధికారపార్టీ బలం పెరిగినట్టు కనిపిస్తున్నా.. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఏం జరుగుతుందన్నదే ప్రశ్న.ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి వేటు పడ్డాక.. ఆత్మీయ సమ్మేళనాలతో వేడిపుట్టిస్తున్నారు పొంగులేటి. ఆయన ఏ పార్టీకి వెళ్లితే.. ఆపార్టీకి ఉమ్మడి జిల్లాలో మొగ్గు ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. ఈ వాదనతో అధికార పక్షం తీవ్రంగా విభేదిస్తోంది. కానీ.. పొంగులేటివైపు చాలా ఆశగా చూస్తున్నాయి కాంగ్రెస్‌, బీజేపీలు. ఇప్పటికే రాహుల్‌ గాంధీ దూతలు పొంగులేటితో మాట్లాడారు. బీజేపీ నేతలు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మాటలు కలిపారు. కానీ.. పొంగులేటి క్లారిటీ ఇవ్వడం లేదు. కర్నాటక ఎన్నికల ఫలితాలతో ఏదో ఒకటి డిసైడ్‌ చేద్దామని అనుకున్నా.. మాజీ ఎంపీ పునరాలోచనలో పడ్డారన్నది కొందరి అభిప్రాయం. పొంగులేటి మాత్రం చాలా ఉత్సాహంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. జిల్లాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు కూడా షర్మిల సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. షర్మిల స్వయంగా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ ఆరంభ సభ కూడా ఖమ్మంలోనే నిర్వహించి.. జిల్లాపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టినట్టు అప్పుడే చెప్పకనే చెప్పారు షర్మిల. జిల్లాలో పూర్వ వైభవం సాధించాలని చూస్తున్న లెఫ్ట్‌పార్టీలు అధికారపక్షం బీఆర్‌ఎస్‌తో జత కట్టాయి. పొత్తులో రెండు మూడు సీట్లలో పోటీ చేసి చట్ట సభల్లో మళ్లీ తమ వాణి వినిపించాలనే పట్టుదలతో ఉన్నాయి వామపక్షాలు. ప్రధానపార్టీలకు తోడు ప్రభుత్వ సర్వీసులో ఉన్న కొందరు అధికారులు సైతం ఖమ్మం జిల్లావైపే చూస్తున్నారు. హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు కొత్తగూడెంలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూనే మధ్య మధ్యలో పొలిటికల్‌ డైలాగులు వల్లెవేస్తున్నారు. ఎన్నికలు సవిూపించే కొద్దీ ఇలాంటి చిత్రాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రధాన పార్టీలు ఒకవైపు.. బలం చాటుకునే ప్రయత్నంలో పొంగులేటి.. బోణీ కొట్టాలని వైఎస్సార్టీపీ.. ఎర్ర జెండాను రెపరెపలాడిరచాలని కామ్రేడ్లు ఇలా ఖమ్మం గుమ్మాన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అగ్రభాగాన నిలబెడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *