ఉద్యోగుల కోసం ట్విన్‌ టవర్స్‌

తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తున్న నేపథ్యంలో ఆయా హెచ్‌వోడీల కార్యాలయాలను ఒకేచోటకు చేర్చడంపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో ఇటీవలే చర్చించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వశాఖల్లోని హెచ్‌వోడీలు, వారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి సవిూపంలో విశాలమైన ప్రభుత్వం స్థలాలు ఎకడెకడున్నాయో ఆరా తీశారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు హెచ్‌వోడీల కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా ట్విన్‌ టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు. సెక్రటేరియట్‌కు సవిూపంలో ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం బాధ్యతలను చీఫ్‌ అడ్వయిజర్‌, మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ కు సీఎం కేసీఆర్‌ అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో అధికారుల బృందం సెక్రటేరియట్‌కు దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించి, సీఎంకు రిపోర్టు అందజేసినట్లు తెలిసింది. ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం కోసం పాటిగడ్డ, రెడ్‌ హిల్స్‌, ఆదర్శ్‌ నగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను అధికారులు పరిశీలించారు. పాటిగడ్డలో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. అక్కడ టవర్స్‌ నిర్మించి, సెక్రటేరియట్‌కు వచ్చేందుకు వీలుగా పాటిగడ్డ నుంచి సంజీవయ్య పార్కు ప్రాంతం వరకు 600 విూటర్ల పొడవుతో రైల్వే ట్రాక్‌ పై నుంచి బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ బ్రిడ్జి నిర్మిస్తే బేగంపేట పరిసరాల్లో ట్రాఫిక్‌ రద్దీ కూడా తగ్గుతుందని భావిస్తూ ఉన్నారు. పాటిగడ్డ స్థలం వద్దనుకుంటే, సెక్రటేరియట్‌ సవిూపంలోని ఆదర్శనగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్‌ లో నిర్మించవచ్చని.. అక్కడి నుంచి సెక్రటేరియట్‌కు వచ్చేందుకు స్కై వేను నిర్మించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్‌ పూర్తిగా పాతపడినవి, పక్కనే ఉన్న రిడ్జ్‌ హోటల్‌ స్థలం, ఆ వెనుక ఉన్న లోకాయుక్త బిల్డింగ్‌ స్థలాన్ని సేకరిస్తే, ట్విన్‌ టవర్స్‌కు కావాల్సినంత స్థలం అందుబాటులోకి వస్తుందని వివరించారు. సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే భూమి పూజ చేసేందుకు అధికారులు రెడీగా ఉన్నారు. స్థలం ఎంపిక ఫైనల్‌ అయిన తర్వాత సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించి, టవర్స్‌ నిర్మాణంపై సలహాలు, సూచనలు చేస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *