ప్రకాశంలో బాలినేని మౌనవ్రతం…

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ గెలుచుకుంది 8 మాత్రమే. అంటే ప్రకాశం జిల్లాలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయినా తన ఉనికి మాత్రం చాటుకుంది. ఆ తర్వాత కరణం బలరాం వంటివారు వైసీపీవైపు వెళ్లినా.. ఇప్పటికా అక్కడ వైసీపీకి క్లీన్‌ స్వీప్‌ చేసేంత బలం లేదనేది బహిరంగ రహస్యమే. దానికి తోడు వైసీపీలోనే వర్గ పోరు ముదిరిపోయింది. ప్రకాశం జిల్లాకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నా.. ఇప్పుడు ఆయనతోనే అసలు సమస్య మొదలైంది. మార్కాపురంలో సీఎం జగన్‌ సభ తర్వాత బాలినేని అలకపాన్పు ఎక్కారు. ఓబీసీ నేస్తం నిధుల్ని బాలినేని చేతులవిూదుగానే విడుదల చేసినా ఆయన అలక తీరలేదు. ప్రస్తుతం ఆయన పార్టీపై గుర్రుగానే ఉన్నారు. ఇటీవల మా నమ్మకం నువ్వే జగన్‌ రివ్యూ విూటింగ్‌ లో బాలినేని అసలు మైక్‌ పట్టుకుని మాట్లాడనే లేదు. దీంతో ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మార్కాపురం సభకు సీఎం జగన్‌ వచ్చే సమయంలో హెలిప్యాడ్‌ వద్దకు బాలినేని వాహనాన్ని వెళ్లనీయకపోవడంతో అసలు గొడవ మొదలైంది. దీని వెనక ఎవరున్నారు, ఎవరి ప్రోత్సాహం వల్ల బాలినేనిని సదరు సీఐ అడ్డుకున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ బాలినేని మాత్రం, తన సొంత జిల్లాలో తనను ఎవరో తక్కువచేసి చూస్తున్నారని రగిలిపోతున్నారు. అందుకే ఆయన తాజా ప్రెస్‌ విూట్‌ లో అసలు మైక్‌ ముట్టుకోలేదు. సహజంగా పక్క జిల్లాల వ్యవహారాలను కూడా బాలినేని చక్కబెడుతుంటారు. ఆయన సమన్వయకర్త బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అలాంటి ఆయన.. ఇప్పుడు సొంత జిల్లా విషయంలోనే అలిగి ఉన్నారనే విషయం అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది. జిల్లాలో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమంపై సవిూక్ష, విలేకరుల సమావేశాన్ని ఒంగోలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని కూడా హాజరయ్యారు కానీ మాట్లాడకుండానే వెనుదిరిగారు. సవిూక్షకు జిల్లాలోని ఎమ్మెల్యేలంతా హాజరు కావాల్సి ఉన్నా.. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి రాలేదు. మార్కాపురం సీఎం సభ విషయంలో జరిగిన గందరగోళం తర్వాత ఆయనతో కలిసేందుకు బాలినేని ఇష్టపడలేదని, అందుకే జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సమావేశానికి ఆయన రాలేదని అంటున్నారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, సంతనూతలపాడు, దర్శి ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వీరిలో కొంతమంది వ్యక్తిగత పనులున్నాయని చెప్పి అనుమతి తీసుకున్నా, మరికొందరు కావాలనే ఈ కార్యక్రమానికి రాలేదని చెప్పుకోవాలి. దీనికి కారణం కూడా బాలినేని మార్కాపురం ప్రోటొకాల్‌ గొడవేనని తెలుస్తోంది. పోనీ బాలినేని హాజరైనా, ఆయన మాట్లాడారా అంటే అదీ లేదు. ఆయన కూడా సైలెంట్‌ గా ఉండటంతో జిల్లా మంత్రి హోదాలో ఆదిమూలపు సురేష్‌ ఏదో మాట్లాడేసి వెళ్లిపోయారు. ప్రాంతీయ సమన్వయ కర్తగా ఉన్న బాలినేని సైలెంట్‌ గా ఉండటం చర్చనీయాంశమైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ ఇన్‌ చార్జ్‌ లను పెట్టింది. చీరాలలో కరణం బలరాం వైసీపీలో చేరి ఆయనే అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇన్‌ చార్జ్‌ ల వ్యవహారం కొంతమంది స్థానిక నేతలకు మింగుడు పడటంలేదు. ఈ పంచాయితీలు చేయడానికి బాలినేని ప్రయత్నించినా కొన్నిసార్లు సాధ్యపడలేదు. అందులోనూ ఇప్పుడు ఆయనకు సొంత సమస్యే చికాకు పెడుతోంది. సొంత జిల్లాలో బాలినేనికి అవమానం అంటూ సోషల్‌ విూడియా హోరెత్తిపోయే సరికి ఆయనకు ఏం చేయాలో తెలియడంలేదు. అందుకే కొన్నాళ్లు ఆయన మౌన వ్రతం పాటించినట్టు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *