కొమటిరెడ్డి పాదయాత్ర…. రేవంత్‌ లో టెన్షన్‌

నల్గొండ, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
తెలంగాణలో పాదయాత్రల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దఫాలు పూర్తి చేసుకుని మూడోసారి ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ పాదయాత్రల అంశం హాట్‌ టాపిక్‌ అవుతోంది. తెలంగాణలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని అధికార టీఆర్‌ఎస్‌పై ఒత్తిడి తీసుకువచ్చేలా త్వరలో పాదయాత్ర చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. విజయదశమి నుండి తన పాదయత్రను షురూ చేస్తానని.. ఈ పాదయత్రలో భాగంగా టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతున్నట్లు వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు పాదయాత్ర థీమ్‌ సాంగ్‌ను సైతం ప్రారంభించారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కాంగ్రెస్‌లో ఎవరి అనుమతి తీసుకుని ఈ పాదయాత్ర ప్రకటన చేశారనే విషయం పక్కన పెడితే.. ఆయన చేసిన ప్రకటన పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.కోమటిరెడ్డి పాదయాత్ర విషయంలో ప్రకటన చేయడంతో టీపీసీసీ చీఫ్‌పై ఆయన అభిమానులు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచన రేవంత్‌ రెడ్డికి చాలా కాలంగా ఉంది. ఈ విషయాన్ని ఆయనే గతంలో అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. తాజాగా కోమటిరెడ్డి పాదయాత్ర చేస్తానని చెప్పడంతో రేవంత్‌ రెడ్డి సైతం పాదయాత్ర చేపట్టాలని అభిమానులు సోషల్‌ విూడియా వేదికగా విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఓ సారి పాదయాత్ర చేపట్టేందుకు రేవంత్‌ రెడ్డి ప్రయత్నాలు కొసాగించారని, అయితే అదే సమయంలో బండి సంజయ్‌తో పాటు వైఎస్‌ షర్మిల కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుండటంతో తన పాదయాత్రకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి అనుమతి రాలేదని అందువల్లే రేవంత్‌ రెడ్డి తన ప్రతిపాదనను వాయిదా వేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన పాదయాత్ర అంశాన్ని ప్రస్తావిస్తూ అతి తక్కువ కాలంలో పాదయాత్ర నిర్వహించడం సాధ్యమే అని రేవంత్‌ రెడ్డి పేర్కొనడం అప్పట్లో ఆసక్తిని రేపింది. తాజాగా పార్టీలో కోమటిరెడ్డి పాదయాత్రకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో టీపీసీసీపై ఆయన అనుచరులు, అభిమానులతో పాటు పార్టీలోని ఓ వర్గం పాదయత్రకు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
2021 ఫిబ్రవరిలో నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో రేవంత్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా దీక్షలో ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన దీక్షను ఒక్కసారిగా పాదయాత్రగా మార్చుకోవడం కాంగ్రెస్‌ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయం హస్తం పార్టీలో అలజడి రేపింది. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా రావిలాలలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంటే సీనియర్లు మాత్రం రేవంత్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రత్యేక సంప్రదాయం ఉంటుందని హైకమాండ్‌ పర్మిషన్‌ లేనిదే పాదయాత్ర చేపట్టడానికి వీలు లేదని అప్పట్లో సీనియర్లు పెదవి విరిచారు. అయితే, తాజాగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పాదయాత్రను ప్రకటించడం, యాత్ర ఎక్కడ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అనే విషయాలు పేర్కొనడం హాట్‌ టాపిక్‌ అవుతోంది. అయితే, తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి పార్టీని వీడుతాడనే ప్రచారం జరుగుతున్న తరుణంలో వెంకట్‌ రెడ్డి తాను పార్టీ కోసం పాదయాత్ర చేపడతానని ప్రకటన చేయడం పార్టీకి కలిసి వచ్చే అంశమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, ఈ పాదయాత్రకు మిగతా నేతలు కలిసి వస్తారా? లేక అలకబూనుతారా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *