బిక్కు బిక్కుమంటున్న నగర జనం

నగర ప్రజలను వర్షం భయం వెంటాడుతోంది. గత కొన్ని రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో తరుచుగా వర్షం కురుస్తుండడంతో బస్తీలు, కాలనీలను వరద ముంచెత్తుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్‌ ఘాట్‌, అంబర్‌ పేట్‌ వంతెనలను సైతం మూసి వేశారు. మూసీ ఉధృతంగా ప్రవహించి సవిూపంలోని కాలనీలను ముంపునకు గురి చేసింది. సుమారు రెండేళ్లుగా కురుస్తున్న భారీ నుండి అతిబారి వర్షాలు గ్రేటర్‌ ప్రజలకు కంటి విూద కునుకులేకుండా చేస్తున్నాయి. గతంలో ముంపునకు గురైన ప్రాంతాలలో వరద సమస్యలకు చెక్‌ పెట్టేందుకు సమయం ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం కారణంగా అప్పట్లో నగర ప్రజలు చవిచూసిన చేదు అనుభవాలు తిరిగి పునరావృతం అవుతున్నాయి.2020 అక్టోబర్‌ లో జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అయ్యింది. గ్రేటర్‌ పరిధిలోని వందలాది కాలనీలు నీట మునిగాయి. కోట్లాది రూపాయల ఆస్థి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. కొన్ని ప్రాంతాలలో నెలల పాటు వరద నీరు అలాగే ఉండిపోయింది. దీంతో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని, భవిష్యత్‌ లో ముంపు సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించగా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకున్నదాఖలాలు లేవు. అప్పట్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉండడంతో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం రూ. 10 వేల ఆర్ధిక సహాయం చేయవలసి వచ్చింది. అయితే తాజాగా ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో వరద ముంపునకు గురైన గ్రేటర్‌ ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా వర్షాకాలం ఆరంభంలోనే వరద నీరు నగరాన్ని ముంచెత్తడంతో షరా మామూలే అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.రెండేళ్లుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వర్షం నీరు బస్తీలను, కాలనీలను, రోడ్లను ముంచెత్తుతోంది. పీ అండ్‌ టీ కాలనీ, శారదానగర్‌, కోదండరామ్‌ నగర్‌, వీవీ నగర్‌, రెడ్డి కాలనీ, చైతన్యపురి, కొత్తపేట నాగోలు అయ్యప్ప కాలనీ, రామంతాపూర్‌, అంబర్‌ పేట, టోలీచౌకీ, నదీం కాలనీ, గగన్‌ పహాద్‌, బేగంపేట్‌, నార్సింగి, బయో డైవర్శిటీ, మెహిదీపట్నం, బాబానగర్‌, ఉప్పుగూడ, తానాజీ నగర్‌, భయ్యాలాల్‌ నగర్‌, శివాజీ నగర్‌, చాంద్రాయణ్‌ గుట్ట, జుబైల్‌ కాలనీ తదితర ప్రాంతాలు సుమారు ఐదడుగుల మేర నీట మునిగాయి. ఫలక్‌ నుమా బ్రిడ్జిపై సుమారు ఆరడుగుల గొయ్యి పడగా రాకపోకలు నిలిపివేశారు. పాతబస్తీలో గుర్రం చెరువు తెగిపోయి నీరు కింది భాగంలో ఉన్న బస్తీలను ముంచెత్తింది. అప్పట్లో గోషామహల్‌ నియోజకవర్గం మంగళ్‌ హాట్‌ డివిజన్‌ ఆర్‌ కే పేట్‌ లో వర్షాల కారణంగా మట్టి గోడ తడిసిపోయి అర్ధరాత్రి వేళ కూలడంతో ఇంట్లో నిద్రిస్తున్న అదిబ(6) అనే బాలిక తీవ్ర గాయాల పాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. తపోవన్‌ కాలనీలో వరద నీటిలో పడి ఓ ఎలక్ట్రీషియన్‌ కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యాడు. కాగా వర్షాలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి చేరడంతో ప్రజలతోపాటు ప్రభుత్వం ముంపు వరద ముంపును మరచిపోయింది. తిరిగి వర్షాకాలం మొదలవ్వడంతో రానున్న రోజులలో పరిస్థితులు ఎలా ఉంటాయోననే భయం అందరిలో నెలకొంది. గతంలో మాధిరిగా వరద నీటి ముంపు నుండి రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *