మళ్లీ తెలంగాణపై టీడీపీ ఫోకస్‌

హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణ రాజకీయాలపై ఫోకస్‌ చేశారు. రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్‌ కమిటీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీడీపీకి కంచుకోట అని అన్నారు. తెలంగాణలో మళ్లీ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని.. అద్భుతమైన స్పందన వస్తుందని పేర్కొన్నారు. టీడీపీ పుట్టింది హైదరాబాద్‌లోనే అని బాబు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. తెలుగు జాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని అన్నారు. సెప్టెంబర్‌ రెండో వారంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించిన సన్నాహాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇదిలా ఉండగా.. బాబును ఎమ్మెల్యే పొడెం వీరయ్య, అఖిల పక్షనేతలు కలిసి.. ఆంధ్రప్రదేశ్‌, భద్రాద్రి సరిహద్దులోని 5 గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని కోరారు.ఎంతో ఘన చరిత్ర కలిగిన టీడీపీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ కనుమరుగైపోయింది. టీ టీడీపీలోని కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో తెలంగాణలో టీడీపీ మరింత బలహీనమైంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. మరో సంవత్సరంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తెలంగాణపై ఫోకస్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *