Rules Ranjann: మూడో పాట వచ్చేసింది

కిరణ్ అబ్బవరం(kiran abbavaram), నేహా శెట్టి (Neha shetty) జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) . ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే యువతకి ఎంతగానో చేరువైన నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘రూల్స్ రంజన్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి, ‘నాలో నేనే లేను’, ‘సమ్మోహనుడా’ పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది.

‘రూల్స్ రంజన్’ నుంచి ‘ఎందుకురా బాబు’ అంటూ సాగే మూడో పాట లిరికల్ వీడియోని ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇదొక ప్రేమ విఫల గీతం. కథానాయకుడు తన ప్రేమ విఫలమైందని బాధలో ఉండగా, అతన్ని ఆ బాధ నుంచి తీసుకురావడానికి స్నేహితులు పాడిన పాట ఇది. పేరుకి ఇది ప్రేమ విఫల గీతమే అయినప్పటికీ.. సంగీతంలో, సాహిత్యంలో కొత్తదనం కనిపిస్తోంది. ‘నాలో నేనే లేను’, ‘సమ్మోహనుడా’ పాటల మాదిరిగానే అమ్రిష్ గణేష్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. గీత రచయత కాసర్ల శ్యామ్ అందరికీ అర్థమయ్యే పదాలతో పాటను ఎంతో అర్థవంతంగా, అందంగా మలిచారు. “లేని షూసుకి ఏడ్వొద్దు ఉన్న కాళ్ళని చెయ్ ముద్దు”, “పక్క ఇంటి అంజలిలోనా ఏంజిల్ చూసేయ్ రా బ్రదరు”, “చిల్లులు పడ్డ గుండెకు ఫ్రెండ్ షిప్ ప్యాచుతో చుట్టేస్తా గ్లోబు” అంటూ సాగిన పంక్తులు వినసొంపుగా ఉంటూ పాటలోని భావాన్ని తెలియజేస్తున్నాయి. గాయకులు రాహుల్ సిప్లిగంజ్, రేవంత్.. పాటకి తగ్గట్లుగా కథానాయకుడి విషాదాన్ని కప్పేసేలా పాటని ఉత్సాహంగా ఆలపించి కట్టిపడేశారు. లిరికల్ వీడియోలో హాస్యనటులు వైవా హర్ష, హైపర్ ఆది, సుదర్శన్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో సరదా పాటతోనే పాఠం చెబుతూ, నాట్యం చేస్తూ కథానాయకుడిని బాధ నుంచి బయటకు తీసుకురావడం ఆకట్టుకుంది. ఈ పాటకి శిరీష్ నృత్య రీతులు సమకూర్చారు. మొత్తానికి ‘ఎందుకురా బాబు’ పాట కూడా ‘నాలో నేనే లేను’, ‘సమ్మోహనుడా’ పాటల తరహాలోనే విశేష ఆదరణ పొందుతుంది.

“వినోదమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర నిర్మాతలు తెలిపారు. సగటు సినిమా ప్రేక్షకుడు మనసారా వినోదాన్ని ఆస్వాదించే చిత్రమవుతుంది. ఇందుకు చిత్ర కథ, నాయకానాయికల పాత్రలు, కథానుగుణంగా సాగే ఇతర ప్రధాన తారాగణం పాత్రలు, సంభాషణలు, సంగీతం ఇలా అన్నీ సమపాళ్లలో చక్కగా కుదిరిన ఓ మంచి చిత్రం అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు” చిత్ర నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నెల ప్రథమార్థంలో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *