పావురాల విసర్జనతో ప్రాణంతకం

శాంతికి చిహ్నం.. భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు.. ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? జీవవైవిధ్య పరిరక్షణ.. ఆహ్లాదం కోసమో లేక అన్ని విధాలా కలిసి వస్తుందన్న నమ్మకంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ఇటీవల ఓ ప్రముఖ సినీనటి భర్త మరణానికి పావురాల విసర్జితాలే కారణమా..? ఈ ప్రశ్నలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో వైరల్‌గా మారడంతో పాటు పలు చర్చోపచర్చలకు కారణమైన విషయం విదితమే. అయితే తన భర్త మరణానికి పావురాలు కారణం కాదని ఆ నటి స్పష్టత ఇచ్చింది. కాగా ఇదే తరుణంలో నగరంలో పావురాల సంఖ్య పెరిగితే రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీ రోగాల అడ్డాగా మారడం తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ప్రధానంగా ఈ ఇన్‌ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం సైతం తేల్చి చెప్పింది. రాష్ట్ర రాజధానిలో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షల పావురాలు నగరంలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తేటతెల్లం చేసేందుకు ప్రాఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ వాసుదేవరావు బృందం గతంలో అధ్యయనం జరిపింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సవిూప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఈ బృందం హెచ్చరించింది.పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు తెలిపారు. అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదని, వాటిని పెంచుతూనే ఉన్నారని చెబుతున్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *