కేసీఆర్‌ కొత్త ఎత్తు రాజకీయ వ్యవసాయం

ఎంత మందికి గుర్తుందో ఏమో కానీ, 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, ఒక అమూల్యమైన ప్రకటన చేశారు. ఇకపై తెరాస ఎంత మాత్రం ఉద్యమపార్టీ కాదు, ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీ అన్నది ఆ ప్రకటన. ఇక ఆతర్వాత ఏమి జరిగింది, ఇప్పుడు ఏమి జరుగుతోంది గమనిస్తే, ఈ ఎనిమిదేళ్లలో ఆయన అదే మాట విూద నిలబడ్డారు.అందుకే, ఉద్యమ‘శుద్ధి’ కార్యాన్ని ఓ పవిత్ర కర్తవ్యంగా ముందుకు తీసుకుపోతున్నారు. పుష్కర కాలం పైగా సాగిన, ఉద్యమంలో తన వెంట నిలిచి, ఉద్యమంలో కీలక భూమికను పోషించిన ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ ఉద్వాసన పలికారు. మంత్రివర్గంలోనూ ఉద్యమ ‘మచ్చ’ లేని వారిని ఏరి కోరి తీసుకున్నారు. మొత్తం 16 మంది మంత్రులలో పది మంది ఉద్యమం వాసనలు లేని వారే ఉన్నారు. అంతవరకు ఎందుకు, ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగం చేసిన 1200ని స్మరించుకునే స్థూప నిర్మాణం ఎనిమిదేళ్లు అయినా ఇంకా పూర్తి కాలేదు. అంటే, ప్రపంచమంతా మెచ్చిన ఒక మహోన్నత ఉద్యమ చరిత్రను సమూలంగా తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదే ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోమారు, జాతీయ రాజకీయాలకు నిచ్చెనలు వేసే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, కారాణాలు ఏవైనా జాతీయ రాజకీయాల్లో తమ కంటూ ఒక స్థానం సంపాదించుకునేందుకు, చాల కాలంగా చాలా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు మొదలు, ఏకంగా సొంత పార్టీ ఏర్పాటు వరకు అన్ని ఆప్షన్స్‌ ట్రై చేసి చూశారు. కానీ, ఏదీ వర్కౌట్‌’ కాలేదు. శరత్‌ పవార్‌ నుంచి స్టాలిన్‌ వరకు, మమతా బెనర్జీ మొదలు సోరెన్‌ దాకా, దేవె గౌడ నుంచి అరవింద్‌ కేజ్రివాల్‌ వరకు అందరినీ కలిశారు, చర్చలు జరిపారు.అయినా ఫలితం కనిపించలేదు. అందుకే ఇప్పుడు కేసీఆర్‌ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. వ్యసాయ రంగ సమస్యలు ఎజెండాగా జాతీయ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల పాటు ప్రగతి భవన్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన సమావేశాల ప్రధాన లక్ష్యం అదే అని పరిశీలకులు అంటున్నారు. ఇక్కడ మళ్ళీ కేసేఆర్‌, తెలంగాణ ఉద్యమాన్ని ఆలంబన చేసుకునే ప్రయతనం చేస్తున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమ పంధాలో రైతుల సమస్యలను రాజకీయాలతో ముడివేసే ప్రయత్నం చేశారని అంటున్నారు.నిజానికి, రాష్ట్రంలో రాజకీయంగా, ఇతరత్రా ఎదురవుతున్న సమస్యల నుంచి బయట పడేందుకే, కేసీఆర్‌ రైతు రాగం ఎత్తుకున్నారని విపక్షాలతో పాటుగా స్వపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థతి ఎంత అధ్వాన్నంగా వుందో వేరే చెప్పనక్కరలేదని అంటున్నారు. అయితే, కేసీఆర్‌ మాత్రం, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు పథకాలు అమలవుతున్నాయన్న ఓ ప్రచారాన్ని ఇప్పటికే దేశ వ్యాప్తంగా చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేస్తామని ప్రకటించారు.రైతు సెంటిమెంట్‌ను పట్టిస్తే.. ఇక ఎదురే ఉండదని కేసీఆర్‌ గట్టి నమ్మకం . ఉత్తరాది రైతులు కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కేసీఆర్‌ నమ్ముతున్నారు. సకల జనుల సమ్మె తరహాలో సకల రైతుల సమాహారంగా నిరసనలు, దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తే .. దానికి నాయకత్వం వహిస్తే.. జాతీయ స్థాయికి వెళ్లినట్లేనని కేసీఆర్‌ భావిస్తున్నారు. అయితే, కేసీఆర్‌ అంతిమ లక్ష్యం జాతీయ రాజకీయాలు కాదు, రైతుల సమస్యలకు పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమ నిర్మాణం అసలే కాదు, ఆయన ముందున్న తక్షణ సమస్య, సవాలు 2023 తెలంగాణ శాసన సభ ఎన్నికలు … ఆ గండం గట్టెక్కేటందుకే … ఈ రైతు గోస.. అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *