కారు దిగి…. కమలం పట్టుకుంటారా

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైంది. తొందరలోనే ఎన్నికలు రానున్నాయనే ప్రచారంతో అసంతృప్త నేతలంతా పార్టీలు మారడంపై దృష్టి సారించారు. పార్టీలు సైతం ఎవరిని తమ వైపు తిప్పుకోవాలనే విషయంలో సీరియస్‌గా వర్క్‌ చేస్తున్నాయి. ఓ వైపు అధికార పార్టీ నేతలకు గాలం వేస్తూనే మరో వైపు ప్రత్యర్థి పార్టీల నేతలకు కండువను కప్పేందుకు ఇటు కాంగ్రెస్‌ అటు బీజేపీ ఆరాటపడుతున్నాయి. సంఖ్య బలంపై ఆధారపడిన వలసన వ్యవహారంలో నువ్వా నేనా అన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ పడి మరీ చేరికలకు తలుపులు తెరిచి ఉంచాయి. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన ఓ సన్నివేశం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలైపినట్లైంది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌ తప్పదా అనే టాక్‌ జోరుగా వినిపిస్తోంది. అదే జరిగితే మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న సీఎం కేసీఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ కానుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏం జరగనుందో రాజగోపాల్‌ రెడ్డికి మాత్రమే తెలుసు. కానీ ఆయన కదలికలను మాత్రం అనుక్షణం అన్ని పార్టీలు అబ్జర్వ్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గత ఆదివారం ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో కీలక నేత, మాజీ ఎంపీ ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కూతురు ఎంగేజ్‌ మెంట్‌ కార్యక్రమం హైదరాబాద్‌లోని అప్పా జంక్షన్‌ సవిూపంలో ఉన్న ఓ రిసార్ట్‌ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో పాటు మంత్రులు హరీష్‌ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు తరలి వచ్చారు. బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ పొంగులేటిని పలకరించి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలతో పొంగులేటి మాటముచ్చట చూసిన వారంతా బీజేపీ నేతలతో సఖ్యత బాగానే ఉందంటూ చర్చించుకుంటున్నారు. త్వరలో పొంగులేటి పార్టీ మారి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చ హాట్‌ టాపిక్‌ అవుతోంది.అతి తక్కువ కాలంలో ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి కీలక నేతగా ఎదిగారు. రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ నుండి లోక్‌ సభ స్థానానికి పోటీ చేసిన పొంగులేటి ఘన విజయం సాధించారు. తనతో పాటు తన పార్టీకి చెందిన మరో ముగ్గురిని ఎమ్మెల్యేలుగా గెలిపించి తన సత్తా ఏంటో చాటారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీని విడిచి టీఆర్‌ఎస్‌ గూటికి చేరిన పొంగులేటి.. గత కొంత కాలంగా కారుపార్టీలో ఇమడలేకపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలో ఆధిపత్య పోరుతో సతమతం అవుతున్నారని కారుపార్టీలో వర్గపోరును భరించలేక ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నారనే టాక్‌ చాలా కాలంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తనకు అవకాశం వస్తుందని ఆశించినా కేసీఆర్‌ మరోసారి మొండిచేయి చూపించాడని.. ఈ విషయంలో పొంగులేటి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కారు దిగి కమలం పార్టీకి చేరువ కావాలని ప్రయత్నిస్తున్నారని ఇందులో భాగంగా రాష్ట్ర నేతలతో సఖ్యతతో ఉన్నారనే ప్రచారం తెరపైకి వస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆయన నిజంగానే పార్టీ వీడేందుకు సిద్ధం అవుతున్నారా? రాజగోపాల్‌ రెడ్డి తర్వాత కాషాయ కండువా కప్పుకోబోయేది ఆయనేనా అనేదానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ప్రచారంపై పొంగులేటి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *