ఎవరికి లాభం… ఎవరికి నష్టం…

విజయవాడ, అక్టోబరు 5
జనసేన వల్ల టీడీపీకి నష్టమా? టీడీపీ వల్ల జనసేనకు ప్రయోజనమా? పొత్తు ఎవరికి ఎంత లాభం? పొత్తు లేకుంటే ఎవరి పరిస్థితి ఏంటి? అన్నది ఇప్పుడు రెండు పార్టీల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. పొత్తు ప్రకటన తర్వాత రెండు పార్టీల క్యాడర్‌లో ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి. అనేక చోట్ల తమ వల్ల జనసేన లబ్ది పొందుతుందని టీడీపీ నేతలు అంటుంటే.. ఇంకొన్ని చోట్ల జనసేన వల్లనే టీడీపీకి ఓట్లు పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కిందిస్థాయి క్యాడర్‌లో ఈ రకమైన చర్చతో పాటు బెట్టింగ్‌లు కూడా చోటు చేసుకుంటూ ఉండటం కొంత ఇబ్బందికర పరిణామంగానే చూడాలి. రెండు పార్టీల ఓటు బ్యాంకు ఎవరిది ఎంత అన్నదానిపైనే సీట్ల పంపకం ఆధారపడి ఉంటుందన్నది నేతల నుంచి వస్తున్న మాట. ఒకరకంగా చెప్పాలంటే టీడీపీ 175 నియోజకవర్గాల్లో క్యాడర్‌ ఉన్న పార్టీ. బలమైన ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ ఓటు బ్యాంకును తక్కువగా అంచనా వేయలేం. గత ఎన్నికల్లోనే దాదాపు నలభై శాతానికి పైచిలుకు ఓట్లు సాధించిన పార్టీ. ఎన్టీఆర్‌ ఉన్న ప్పటి నుంచి ఉన్న ఓట్లతో పాటు అదనంగా కొన్ని వర్గాలు చేరడంతో టీడీపీకి పట్టున్న ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఏ నియోజకవర్గంలోనైనా అది తొలి, రెండో స్థానంలో నిలుస్తూ వచ్చింది. అలాంటి టీడీపీ ఇప్పుడు జనసేనతో జట్టుకట్టింది. బూత్‌ స్థాయిలోనూ అది వైసీపీకి ఏమాత్రం తీసిపోని పార్టీగానే చూడాలి. జనసేనకు ఎలాంటి ఓటు బ్యాంకు లేదు. లీడర్స్‌ సంఖ్య కూడా స్వల్పమే. అలాగే క్యాడర్‌ అంటూ ప్రత్యేకంగా లేని పార్టీగానే చూడాలి. ఎందుకంటే పవన్‌ అభిమానులు, కాపు సామాజికవర్గం ఓట్ల విూదనే పవన్‌ ఆధారపడి ఉన్నారు తప్పించి ప్రత్యేకించి కొన్ని వర్గాలను ఆయన ఇప్పటి వరకూ దరిచేర్చుకోలేకపోయారన్నది వాస్తవం. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ కూడా పెద్దగా లేదు. కింది నుంచి పార్టీ బలోపేతంపై ఆయన ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కమిటీలు కూడా లేని పార్టీ కావడంతో ఆ పార్టీకి తాడు, బొంగరం లేని పార్టీగానే భావించాలి. కేవలం పవన్‌ కల్యాణ? ఇమేజ్‌, క్రేజ్‌ పైనే ఆధారపడి ఎన్నికల గోదాలోకి దిగుతుంది. గత ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. పవన్‌ వల్ల టీడీపీ లబ్దిపొందుతుందని జనసైనికులు, తమ వల్లనే జనసేనకు సీట్లు దక్కే అవకాశముందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం కామన్‌ గా మారింది. అందుకే పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికీ టీడీపీకే తొలి ప్రయారిటీ ఇస్తున్నారు. టీడీపీ ఇచ్చిన సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తాము బలంగా ఉన్నామని ఎక్కడైనా చెప్పుకోవాలంటే వేళ్లవిూద లెక్కేసుకోవాల్సిన పరిస్థితి గాజు గ్లాసు పార్టీది. అందుకే ఇప్పుడు ఎవరి వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్న చర్చ మొదలయింది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే తాము ఈసారి ఖచ్చితంగా గెలుస్తామన్న ధైర్యం టీడీపీలో ఉంది. అయితే జగన్‌ ను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోక తప్పని సరి పరిస్థితి. అందుకే పది నుంచి పదిహేను నియోజకవర్గాలకు మించి జనసేనకు ఇచ్చే అవకాశం లేదన్నది టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరి ఇందుకు జనసేనాని అంగీకరిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *