దీర్ఘకాలిక వ్యూహం మిస్‌

నెల్లూరు, అక్టోబరు 4
వారాహి నాలుగో యాత్రలో భాగంగా జనసేన అధినేత కొన్ని నిజాలు విస్మరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓట్లు చీలడంపై ఆయన మాటలు సామాన్యుడికి సైతం విస్మయం కలిగిస్తున్నాయి. తెలుగుదేశంతో పొత్తును అధికారికంగా ప్రకటించిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ తొలిసారి జనం ముందుకు వచ్చారు. వారాహి యాత్ర నాలుగో దశలో భాగంగా ఆయన ఆదివారం అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రకటించారు. వైసీపీ దారుణంగా ఓటమి పాలవుతుందని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య ఓట్లు చీలిపోయాయని చెప్పారు. ఈ సారి అలా జరగనివ్వనని ప్రతిన బూనారు. పవన్‌ ఇక్కడ ఓ లాజిక్‌ మిస్‌ అవుతున్నారు. గత ఎన్నికల్లో వైకాపాకు 49.95 శాతం, తెలుగుదేశానికి 39.17 శాతం, జనసేనకు 5.53 శాతం ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం, జనసేనని కలిపినా.. వైకాపాకి వచ్చినన్ని ఓట్లు రాలేదు. సైకిల్‌, గ్లాసు కలిపి పోటీ చేసినా, వైకాపా గెలుపును ఆపలేకపోయేవారు. ఇది క్షేత్రస్థాయి వాస్తవం. 2019 ఎన్నికల్లో జనసేన ఆటలో అరటిపండులానే మిగిలిపోయింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 138 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 16 మందికి మాత్రమే డిపాజిట్లు దక్కాయి. కేవలం పదహారు మంది మాత్రమే తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో… మొత్తం పోలైన ఓట్లలో, ఆరు శాతం కంటే ఎక్కువ దక్కించుకున్నారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి పవన్‌ కళ్యాణ్‌ అపప్రధ మూట గట్టుకున్నారు. ఈ గణాంకాలు చూస్తే జగన్‌ గెలుపు వెనుక… తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేయడం కంటే, నాటి ప్రభుత్వంపై నెగటివ్‌ ఓటు కంటే, జగన్‌పై ప్రజల నమ్మకమే ఎక్కువగా ఉంది. అప్పుడే పవన్‌లో ఇదివరకటి ఆవేశం అవనిగడ్డ విూటింగ్‌లో కనిపించలేదు. తన అభిమానులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉంటారని జనసేనాని భావించి ఉంటారు. అందుకే కాస్త సంయమనంగా ఉన్నట్లున్నారు. గతంలో ‘జగన్‌, నువ్వు’ అంటూ ఏకవచనంతో సంబోధించిన పవన్‌ అవనిగడ్డ విూటింగ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి గారూ అంటూ మాట్లాడారు. జగన్‌ తనకు శత్రువు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థే అని చెప్పడం కూడా విశేషం. గతంలో మూడు యాత్రల వారాహిలో జగన్‌ను ఏకవచనంతో సంబోధించి, ముఖ్యమంత్రిపై తన ద్వేషాన్ని వెల్లగక్కిన జనసేన అధినేత మాటలో వచ్చిన మార్పును ఆయన అభిమానులు సైతం గమనించారు. తన ఆవేశం అటు తెలుగుదేశానికి, ఇటు జనసేనకు నష్టం కలిగించకూడదనేది అభిమతం కావచ్చు. ముఖ్యంగా వైసీపీకి ఎలాంటి లాభమూ జరగకూడదని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది. అయితే పవన్‌లో వచ్చిన మార్పు శాశ్వతమని భావించక్కర్లేదు. ఆయన రాజకీయాల్లో, విధానాల్లో నిలకడ లేనితనం… ఆయన అభిమానుల్లో సైతం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్‌ లాంటి ప్రత్యర్థిని ఢీకొట్టడానికి ఆవేశం పనికిరాదు… ఆలోచన కావాలి… దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. అవే పవన్‌లో మిస్‌ అవుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *