ప్రశ్నార్థకంగా 24 క్రాఫ్ట్స్‌

ఆగస్టు ఒకటి నుంచి సినిమా షూటింగులను ఆపేస్తున్నామని టాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ప్రకటించింది. అకస్మాత్తుగా సినిమా షూటింగులను నిలిపివేయాల్సినంత పరిస్థితులు ఇండస్ట్రీకి ఎందుకొచ్చాయన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానాలు దొరకడం లేదు. దీని గురించి నిర్మాతలు చెబుతున్న సమాధానాలు నామమాత్రంగానే ఉన్నాయి. కొవిడ్‌ తరువాత ఆదాయ వనరులలో మార్పులు వచ్చాయని, ప్రొడక్షన్‌ కాస్ట్‌ బాగా పెరిగిందని చెబుతున్నారు. కానీ, ఈ అంశాలు షూటింగ్‌ నిలుపుదలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. దీంతో పాటు ఓటీటీ అంశాన్ని కూడా తెరవిూదకు తెచ్చారు. సినిమాలు విడుదలైన కొన్ని వారాల తరువాతనే ఓటీటీలకు రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు. ఒక్కసారిగా షూటింగ్‌ బంద్‌ పెడితే ఇండస్ట్రీ విూద ఆధారపడిన సుమారు 26 వేల మంది కార్మికుల జీవితాలపై నీలినీడలు అలుముకుంటాయి. నిజానికి ప్రస్తుత పరిస్థితికి ఇండస్ట్రీ స్వయంకృతాపరాధమనే స్పష్టమవుతోంది.’ప్రొడక్షన్‌ కాస్ట్‌ పెరిగింది, ఆదాయ వనరులు తగ్గిపోయాయి’ అంటున్న నిర్మాతలు అసలు కాస్ట్‌ను పెంచింది ఎవరన్న అంశాన్ని మర్చిపోయారు. ఇందుకు కరోనాను సాకుగా చూపించడం మరీ విడ్డూరంగా ఉంది. కరోనాకు ముందు, తరువాత కూడా సినిమాలు తీసిన నిర్మాతలకు ఒక్కసారిగా నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇందుకు అడ్డూ అదుపూ లేని బడ్జెట్‌, ఇతర ప్రాంతాల నుంచి హీరోయిన్లు, మ్యూజిక్‌ డైరక్టర్లు, వర్కర్లతో పాటు సాంకేతిక నిపుణులను తీసుకురావడమేనని అంటున్నారు. షూటింగులను మన ప్రాంతాలలో కాకుండా ఇతర దేశాలు, రాష్ట్రాలలో తీయడం వలన కూడా బడ్జెట్‌ అమాంతంగా పెరుగుతోంది.హీరోలకు అమాంతంగా రెమ్యూనరేషన్‌ పెంచడం కూడా బడ్జెట్‌ పెరుగుదలకు కారణంగా కనబడుతోంది.పోటీ పడి మరీ ధరలు పెంచుకుంటూ పోయి, ఇప్పుడు నష్టం వస్తుందని అనడం ఎంతవరకు సమంజసమో ఆత్మ విమర్శ చేసుకోవాలి. భారీ బడ్జెట్‌ సినిమాలు తీయమని ప్రజలు అడగలేదు? కోట్ల రూపాయలతో సినిమాలు తీసి నష్టపోయామంటూ షూటింగులను ఆపడం ఎంతవరకు కరెక్టో నిర్మాతలు ఆలోచించాలి. షూటింగ్‌ ఆపుతామంటున్న పెద్దలు అగ్రహీరోల ధరలు తగ్గిస్తామని అనడం లేదు. ఆయా హీరోలతో చర్చించడం లేదు. హీరోయిన్లు, ఇతర ప్రాంతాల మ్యూజిక్‌ డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులతో చర్చించడం లేదు. షూటింగులను నిలిపివేస్తామంటే ప్రభుత్వానికీ, ప్రజలకు వచ్చే నష్టమేవిూలేదన్న అంశాన్ని నిర్మాతలు గ్రహించకపోవడం బాధాకరంనిత్యం ఎన్నో సమస్యలు, టెన్షన్‌లతో ఉండే ప్రజలు వినోదం కోసం సినిమాకు వెళదామనుకుంటారు. టికెట్‌ ధరలు చూసి బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారు. కొవిడ్‌కు ముందు టికెట్‌ ధరలు సాధారణంగానే ఉన్నా కొవిడ్‌ తరువాత ఒక్కసారిగా పెంచేశారు. దీంతో బడా హీరోల సినిమాలు కూడా నామమాత్రంగానే నడిచాయి. కోట్ల రూపాయలతో సినిమా తీసి ప్రజలపై భారం మోపింది కూడా విూరే కదా? టికెట్‌ ధరలను అమాంతంగా పెంచడంతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు. లేకపోతే సినిమాలు థియేటర్లలో ఆశించిన మేరకు నడిచేవి. నిర్మాతలకు నష్టం వచ్చేది కాదు.ఆంధ్రప్రదేశ్‌లో నిర్ధిష్ట ధరలను నిర్ణయించడంతో అక్కడ థియేటర్లలో సినిమాలు బాగానే నడిచాయి. తెలంగాణలో ధరలను పెంచడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. దీనికి కారణం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కాదా? సినిమాలను ఓటీటీలకు నెలన్నర తరువాతే రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు. అసలు ఓటీటీలను తీసుకొచ్చింది ఎవరు? ఆ వ్యాపారానికి ఆజ్యం పోసింది ఎవరు? ఇండస్ట్రీ పెద్దలే దానికి రూపకర్తలుగా ఉండడం గమనార్హం. ఓటీటీలను కూడా వ్యాపారం చేసి ఏడాదికి ఇంత చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేలా చేసి, ఇపుడు ఓటీటీలతో నష్టమొస్తుందనడంలో ఆంతర్యమేమిటో నిర్మాతలు చర్చించుకోవాలి.షూటింగులను ఆపేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అంటే జవాబు లేదు. ఎవరి కోసం బంద్‌ పెడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాతల కోసం ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో గ్రీవెన్స్‌ సెల్‌ ఉంటుంది. అక్కడ పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకూ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వాలకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రతీ రెండేళ్లకొకసారి దేశవ్యాప్తంగా రూ. నాలుగు వేల కోట్లు కేటాయిస్తుంది.2021`22 ఏడాదికి రూ.4,071.23 కోట్లను కేటాయించింది. 1974 ఆగష్టు 15 నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది, సౌత్‌ ఇండియాలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాలు వస్తుండగా, హిందీ (ముంభై) భోజ్‌పురి (బిహార్‌) ఒడిసీ (ఒడిశా) ఈ ఏడు రాష్ట్రాలు మాత్రమే యాక్టివ్‌గా సినిమాలను తీస్తున్నాయి. కార్పొరేషన్‌లో పరిష్కారం లభించే అవకాశం ఉన్నా నిర్మాతలు దాని ఊసే ఎత్తకపోవడం గమనార్హం.షూటింగులు ఆగిపోతే ఇండస్ట్రీనే నమ్ముకుని బతుకుతున్నవారి పరిస్థితి ఏమిటి? 24 క్రాఫ్ట్స్‌ కింద సుమారు 26 వేల మంది కార్మికులున్నారు. ఇందులో సినిమానే బతుకుగా ఉన్నవారు 13 వేల మంది. ఇప్పుడు వీరంతా ఎటుపోవాలి? నిర్మాతలు సినిమాలు తీయడం వల్లనే వీరికి అవకాశాలు మెరుగుపడుతున్నాయన్నది వాస్తవమే. ప్రస్తుతం వీరి పరిస్థితి ఏమిటన్నదాని విూద క్లారిటీ లేదు. భారీ కుదుపు చోటుచేసుకున్నా ‘మా’ మాత్రం చప్పుడు చేయడం లేదు.టాలీవుడ్‌ మొదటి నుంచి కూడా మన దగ్గర ఉన్న ప్రతిభావంతులకంటే కూడా ఇతర ప్రాంతాలవారికే ప్రాధాన్యత ఇస్తుందన్నది జగమెరిగిన సత్యం. అందుకే ప్రొడక్షన్‌ కాస్ట్‌ అమాంతం పెరుగుతున్నది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సుమారు 200 మంది మ్యూజిక్‌ డైరెక్టర్లు, రెండు వేల మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. 3,200 మంది నిర్మాతలుంటే, 150 మందే సినిమాలు తీస్తున్నారు. నిర్మాతలు, డైరెక్టర్లు, మేనేజర్ల తప్పిదాలను ఇండస్ట్రీ విూద వేసి షూటింగులను ఆపేయడం పెద్దల స్వయంకృతాపరాధమే తప్ప మరొకటి కాదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *