భారీగా పత్తిగా సాగు

పత్తి సాగుకు రైతులు ఏడాది మొగ్గు చూపుతున్నారు. పత్తికి ప్రస్తుతం డిమాండ్‌ ఉండడంతో ఆశాజనకమైన ధర లభించి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పత్తి నిల్వలు నిండుకున్నాయి. కరోనా ప్రభావంతో వివిధ రకాల వస్త్రాలు, మాస్కుల తయారీ అధికం కావడంతో దేశ వ్యాప్తంగా కొన్ని ఏళ్లుగా నిల్వ ఉన్న దాదాపు 20 లక్షల పత్తి బేళ్లు అమ్ముడుపోయాయి. దీంతో, ప్రస్తుతం వస్త్రాల తయారీకి పత్తి కొరత ఏర్పడిరది. మార్కెట్లో డిమాండ్‌ పెరగడంతో పత్తి ధరలు గతేడాది భారీగా పెరిగాయి. ఇదే డిమాండ్‌ ఈ ఏడాదీ కూడా కొనసాగుతోంది. దీంతో, ఈ ఏడాదీ ఆశాజనకమైన ధరలు వస్తాయని రైతులు భావిస్తున్నారు. గతేడాది పొడుగు పింజి పత్తి క్వింటాలు కనీస మద్దతు ధర రూ.6025 కాగా, రూ.8 వేల నుంచి రూ.11 వేల వరకూ రైతులకు లభించింది. రైతుల నుంచి వ్యాపారుల వద్దకు వెళ్లిన తరువాత రికార్డు స్థాయిలో క్వింటాలు రూ.15 వేల వరకు పలికింది. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో కనీస ధర రూ.8 వేలు తగ్గకుండా గరిష్ట ధర రూ.11 వేల వరకూ లభిస్తోంది. ఆదోని మార్కెట్లో ఏటా ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని మార్కెట్‌ను ఆదోని మార్కెట్‌ ప్రభావితం చేస్తోంది. గత కొన్ని నెలలు ఇవే ధరలు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో గతేడాది పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఏటా రాష్ట్రంలో 15.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. గతేడాది 11.15 లక్షల ఎకరాల్లోనే సాగైంది. గతేడాది ధరలు పెరగడంతో ఈ ఏడాది రైతులు పత్తి సాగు వైపు మళ్లీ దృష్టి సారించారు. సాధారణ విస్తీర్ణం 15.25 లక్షల ఎకరాలుగా కాగా, ఇప్పటికే 14.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగులో ఉంది. మరో లక్ష ఎకరాల్లో సాగయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. గతేడాది కన్నా ఈ ఏడాది పైరు కూడా ఆశాజనకంగా ఉంది. ఎకరాకు పది క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది పత్తి ధరలు కనీస మద్ధతు ధరకుమించి రావడంతో తక్కువ విస్తీర్ణంలో సాగు చేసినా, దిగుబడి తగ్గినా రైతులు ఎంతోకొంత లాభపడ్డారు. అంతకుముందు తొమ్మిదేళ్ల కాలంలో ఎప్పుడూ కనీస మద్దతు ధరకు మించి మార్కెట్లో ధరలు లభించలేదు. దీంతో, విసిగిపోయిన రైతులు గతేడాది తక్కువగా సాగు చేశారు. దేశవ్యాప్తంగా వినియోగం పెరగడంతోపాటు దిగుబడులు, విస్తీర్ణం కూడా తగ్గడంతో దేశంలో నిల్వలు లేకుండాపోయాయి. 2022`23 సంవత్సరంలో క్వింటాలు పత్తి కనీస మద్దతు ధర రూ.6,380గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాదీ ధరలు బాగా ఉంటాయని, గతేడాది కన్నా ఏ మాత్రమూ తగ్గవని వ్యాపారులూ చెబుతున్నారు. గుంటూరు కేంద్రంగా దాదాపు వందకుపైగా ఉన్న స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ మిల్లుల్లో నిల్వలు నిండుకోవడంతో ప్రస్తుతం కార్యకలాపాలు మందగమనంగా సాగుతున్నాయి. మరో రెండు నెలల తరువాత తాజా ఉత్పత్తి మార్కెట్‌లోకి వస్తేనే కార్యకలాపాలు ఊపందుకుంటాయని మిల్లుల యజమానులు చెప్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *