సర్దుకుంటున్న ట్రిబుల్‌ ఐటీ

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిబుల్‌ ఐటీలో విద్యార్థులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇంజనీరింగ్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మాసిక పరీక్షలు, పీయూసీ విద్యార్థులకు జూలై 26 నుంచి ల్యాబ్‌ పరీక్షలు ఉన్నందున తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెల రోజుల క్రితం విద్యార్థులు తమ సమస్యలు, డిమాండ్ల సాధన కోసం వారం రోజుల పాటు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. శాశ్వత వైస్‌ ఛాన్స్లర్‌ నియామకంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హావిూ ఇచ్చారు. డైరెక్టరుతో పాటు ఇంచార్జి వైస్‌ ఛాన్స్‌ లర్‌ నియామకం చేయగా.. మిగతా సమస్యలు పరిష్కారం కాలేదు.దీంతో మళ్లీ విద్యార్థులు శనివారం నుంచి ఆందోళన బాట పట్టారు. మరో 48గంటల్లో నెల రోజుల గడువు ముగుస్తుందని.. మళ్లీ ఆందోళనకు సిద్ధం కావాలని విద్యార్థులు రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో ట్రిబుల్‌ ఐటీ అధికారులు విద్యార్థులకు శనివారం నుంచి 31వరకు సెలవులు ప్రకటిస్తూ శుక్రవారం రోజున రాత్రి ప్రకటించారు. సెమిస్టర్‌ బ్రేక్‌ సందర్భంగా మూడు రోజుల పాటు సెలవులు ఇస్తుండగా.. ఈ సారి 9రోజులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం రోజు నుంచి విద్యార్థులకు సెలవులు కావటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి పిల్లలను తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం రోజును ఇంచార్జి వీసీ వి.వెంకటరమణ నాలుగున్నర గంటల పాటు సమావేశమయ్యారు.లోపలికి వెళ్లిన పేరెంట్లకు సెల్‌ ఫోను అనుమతించలేదు. విద్యార్థుల ఆందోళనలపై తల్లిదండ్రులతో చర్చించారని.. కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు విద్యార్థులు చెబుతున్నారు. సెలవుల తర్వాత తిరిగొచ్చే విధ్యార్థులు ఆందోళనల్లో పాల్గొనబోమని పేరెంట్స్‌ నుండి మౌఖిక హావిూ తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అన్ని రకాల అస్త్రాలను వినియోగిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఓ వైపు తమ పిల్లల సమస్యలు, మరోవైపు అధికారుల ఒత్తిళ్లు, హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.అసలు విషయం బయటకు పొక్కకుండా అధికారులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, అకడమిక్‌ ఏరియా, తరగతి గదుల్లోకి విద్యార్థుల సెల్‌ ఫోన్లను అనుమతించమని ట్రిబుల్‌ ఐటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున ఆటంకం కలగవద్దనే ఉద్దేశ్యంతోనే ఆందోళన వాయిదా వేసినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు. ప్రతిరోజూ కొద్దిసేపు నిరసన చేపట్టడం ద్వారా తమ ఆందోళన వాయిదా పై దుష్ప్రచారానికి చెక్‌ పెట్టే దిశగా విద్యార్థులు ప్రణాళిక రూపొందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *