ఈ డైరెక్టర్లు ట్రెండ్‌ సెట్టర్లు

ఒక్క ఛాన్స్‌… సినిమా రంగంలో ఎంతోమంది తలరాతలు మార్చిన అవకాశం అది. దాన్ని అందిపుచ్చుకొని హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌గా అందలం ఎక్కినవాళ్లు ఎంతోమంది. ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో కొందరు దర్శకులు అగ్రహీరోలకు దీటుగా స్టార్‌డమ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. పాన్‌ ఇండియా డైరెక్టర్లుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. హీరోను పక్కనపెట్టి, ఆ దర్శకులు పేరు మీదనే సినిమాలు మార్కెట్‌ అవుతున్నాయి. వారిని నమ్మి నిర్మాతలు వందల కోట్ల రూపాయలు బడ్జెట్‌ పెడుతున్నారు. అగ్రహీరోల సినిమాల్లానే, ఆ డైరెక్టర్లు తీస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఓ క్రేజ్‌ నెలకొంటోంది. ఆ ఫీట్‌ను అందుకున్న కొద్దిమంది యువ దర్శకులు దక్షిణాదిన ఉన్నారు. వీరిలో కొందరు తొలి చిత్రంతో మరికొందరు మలిచిత్రంతో ఘన విజయాలను అందుకొని పాన్‌ ఇండియా స్థాయిలో దర్శకులుగా తమదైన ముద్ర వేస్తూ సాగుతున్నారు. ఈ కోవలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘కేజీఎఫ్‌’ దర్శకుడు యష్‌ గురించే. ఈ సినిమా చేసేనాటికి దర్శకుడిగా ఆయనది ఒక సినిమా అనుభవమే. ఆయన తొలి చిత్రం ‘ఉగ్రం’ కన్నడలో సూపర్‌హిట్‌ అయింది. ఇక ‘కేజీఎఫ్‌’తో ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు. భారతీయ సినిమా రంగంలో ప్రశాంత్‌ నీల్‌ పెను సంచలనంగా మారారు. కర్ణాటక వెలుపల ఎవ రికీ తెలియని యష్‌లాంటి మిడ్‌రేంజ్‌ హీరోతో ఓ సినిమా చేయడం, అది కూడా భారీ బడ్జెట్‌తో అంటే ప్రశాంత్‌నీల్‌ గట్స్‌ ఏమిటో తెలుస్తుంది. ఆ సినిమాతో రాఖీబాయ్‌గా యష్‌ను పాన్‌ ఇండియా రేంజ్‌లో నిలబెట్టాడు. ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌ 2’ను తెరకెక్కించి ఏకంగా రూ. 1100 కోట్ల వసూళ్లను రాబట్టి సత్తా చాటారు. ఈ రెండు చిత్రాల తర్వాత ప్రశాంత్‌నీల్‌ చేయబోయే సినిమా కోసం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి మొదలైంది. ప్రశాంత్‌నీల్‌తో తమ కెరీర్‌లో ఒక్క సినిమా చేసినా చాలు అనుకున్న హీరోలు ఎందరో. హీరో ఎలివేషన్‌ ఆ స్థాయిలో ఉంటుంది ఆయన సినిమాల్లో. ఈ దశలో ప్రభాస్‌తో ‘సలార్‌’ సినిమా ప్రకటించగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. యష్‌ మ్యాజిక్‌ కోసం ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వరుస ప్లాప్స్‌తో సతమతమవుతున్న ప్రభాస్‌ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. భారీ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. డిసెంబరు 22న ‘సలార్‌’ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌

ప్రశాంత్‌నీల్‌ తర్వాత దక్షిణాదిన మార్మోగుతున్న మరో పేరు లోకేశ్‌ కనగరాజ్‌. లొకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ పేరుతో ఓ సినిమా ప్రపంచాన్నే ఆయన సృష్టించారు. కార్తి హీరోగా వచ్చిన ‘ఖైదీ’ చిత్రంతో దర్శకుడిగా ఆయన పేరు దేశమంతా తెలిసింది. 2019లో విడుదలైన ఈచిత్రం అప్పట్లోనే సూనాయాసంగా వందకోట్ల వసూళ్లను అధిగమించింది. దర్శకుడిగా లోకేశ్‌కు ఇది మూడో చిత్రం. ఇక అప్పటి నుంచి డైరెక్టర్‌గా ఆయన చేయబోయే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. విజయ్‌తో తెరకెక్కించిన ‘మాస్టర్‌’ కూడా ఘన విజయం అందుకొంది. రూ. 200 కోట్లకు పైబడి వసూళ్లను సాధించింది. కమల్‌హాసన్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన ‘విక్రమ్‌’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకొంది. రూ. 100 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 400 కోట్ల పైబడి వసూళ్లను అందుకొంది. హీరోగా కమల్‌హాసన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌కు ఊపిరి పోసింది. తాజాగా లోకేశ్‌ విజయ్‌తో ‘లియో’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్‌ రూ. 300 కోట్లు. తమిళనాడులో తప్ప బయట ఎక్కడా పెద్దగా మార్కెట్‌లేని విజయ్‌ను నమ్మి నిర్మాతలు ఇంత మొత్తం పెట్టడం లేదని, లోకేశ్‌ కనగరాజ్‌ బ్రాండింగ్‌ అందుకు కారణమని ఇండస్ట్రీ వర్గాల మాట. ఈ నెల్లోనే ‘లియో’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

8 ‘యానిమల్‌’పై ఆసక్తి

‘అర్జున్‌రెడ్డి’ లాంటి కల్ట్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. ఆ చిత్రాన్ని రూ. 5 కోట్లతో నిర్మిస్తే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. హిందీలో ‘కబీర్‌సింగ్‌’గా రేమేక్‌ చేసి అక్కడా హిట్‌ కొట్టారు. ఈ రెండు సినిమాలు భారీ వ సూళ్లను సాధించి సందీప్‌రెడ్డి పేరు ఇంటా బయటా మార్మోగేలా చేశాయి. ఇప్పుడు ఆయన రణ్‌బీర్‌కపూర్‌ హీరోగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్‌’ చిత్రంపై ప్రేక్షకుల దృష్టి ఉంది. ‘కబీర్‌సింగ్‌’తో రూ. 300 కోట్లు కొల్లగొట్టిన సందీప్‌ ఈసినిమాతో ఎన్ని వసూళ్లు సాధిస్తాడనే దానిపైనే ప్రేక్షకులు, పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. డిసెంబర్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

8 2018 తర్వాత

మలయాళం బ్లాక్‌బస్టర్‌ ‘2018’తో పాన్‌ ఇండియా ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకొన్నారు దర్శకుడు జూడ్‌ ఆంటోని జోసెఫ్‌. 2018లో కేరళలో వచ్చిన భయంకరమైన వరదలు, నాటి వాస్తవ ఘటనల ఆధారంగా సాగే కథ ఇది. ఈ ఏడాది వేసవిలో విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లో వందకోట్ల వసూళ్లను సాధించింది. ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 200 కోట్ల వసూళ ్లను రాబట్టింది. వచ్చే ఏడాది ఆస్కార్‌ పురస్కారాల కోసం భారతదేశం తరపున ‘2018’ అధికారికంగా నామినేట్‌ అయింది. దీంతో జూడ్‌ ఆంటోని జోసెఫ్‌ తదుపరి చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. లైకా ప్రొడక్షన్స్‌లో జూడ్‌ తన తర్వాతి చిత్రం ప్రకటించారు.

8 వెయ్యికోట్ల క్లబ్‌లోకి

‘జవాన్‌’తో వెయ్యికోట్ల వసూళ్ల క్లబ్‌లో స్థానం దక్కించుకున్న దర్శకుడిగా నిలిచారు అట్లీ. షారూఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం హిందీ బెల్ట్‌తో పాటు ద క్షిణాదినా మంచి వసూళ్లనే అందుకొంది. దర్శకుడిగా పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు అట్లీ. ‘జవాన్‌’ తర్వాత ఆయన చేయబోయే సినిమాపై ఇటు ప్రేక్షకుల్లో అటు ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. ‘జైలర్‌’ చిత్రంతో పరభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు తమిళ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌. నిలకడగా కొనసాగితే పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా ఎదగడం ఖాయం అని సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోన్న మాట. ‘ఉప్పెన’తో వంద కోట్ల వసూళ్లను కొల్లగొట్టి గురువు సుకుమార్‌కు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు బుచ్చిబాబు సానా. అందుకే రామ్‌చరణ్‌ పిలిచి మరీ అవకాశమిచ్చారు. రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ఎన్ని సంచలనాలకు నెలవవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *