ప్రత్యక్ష ఎన్నికల్లోబోణి కొట్టిన జన్‌ సురాజ్‌ పార్టీ

బీహార్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో బోణీ కొట్టింది. బీహార్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. గత ఏడాది జన్‌ సురాజ్‌ పార్టీని స్థాపించిన ప్రశాంత్‌ కిషోర్‌.. అక్టోబర్‌ 2న ఆయన జన్‌ సురాజ్‌ యాత్రకు శ్రీకారంచుట్టడం తెలిసిందే. గురువారంనాటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జన్‌ సురాజ్‌ పార్టీ అభ్యర్థి అఫాక్‌ అహ్మద్‌ విజయం సాధించారు. ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో సాధించిన తొలి విజయం ఇదే కావడం విశేషం. ఈ విజయంతో బీహార్‌ శాసనమండలిలో ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీకి ప్రాతినిధ్యం దక్కినట్లయ్యింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని ఐదు జిల్లాల ఓటర్లు ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించడం బీహార్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రశాంత్‌ కిషోర్‌ పాదయాత్ర చేపట్టినప్పటి నుంచే అఫాక్‌ అహ్మద్‌ ఆ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించడం జన్‌ సురాజ్‌ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. తన యాత్ర సమయంలోనే ఉపాధ్యాయులతో రెండుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన ప్రశాంత్‌ కిషోర్‌.. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాగట్‌ బందన్‌ కూటమి అభ్యర్థి ఆనంద్‌ పుష్కర్‌పై 1500 ఓట్ల మెజార్టీతో అహ్మద్‌ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ధర్మేంద్ర కుమార్‌ కేవలం 455 ఓట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జన్‌ సురాజ్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం బీహార్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ మరింత బలోపేతమై.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారుతుందని ఆయన మద్ధతుదారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, జేడీయు నేతలు పదేపదే ఆరోపణలు చేయగా.. వాటిని ప్రశాంత్‌ కిషోర్‌ ఎప్పటికప్పుడు తోసిపుచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *