కిరణ్‌ రెడ్డి అండర్‌ గ్రౌండ్‌ వర్క్‌..?

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరినా ఆయన ఏ పనీ చేయలేదు. ఏ పదవీ తీసుకోలేదు. ఆయన అంగీకరించి ఉంటే ఏపీ పీసీసీ చీఫ్‌ పోస్ట్‌ ఇచ్చి ఉండేవాళ్లు. కానీ ఆయన తీసుకోలేదు. ఇటీవల బీజేపీలో చేరారు. చేరగానే కర్ణాటక సహా తెలంగాణలోనూ కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకున్నారు. కానీ ఆయన సైలెంట్‌ గా ఉండిపోయారు. పార్టీ హైకమాండ్‌ కూడా ఆయన ఫలానా పని చేయాలని చెప్పడం లేదు. ఏప్రిల్‌ 7న బీజేపీలో చేరినప్పటి నుంచి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఒక సారి కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు మాత్రం అంత వేగాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. స్పీకర్‌ గా పనిచేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆఖరి ముఖ్యమంత్రిగా ఉన్నా రాజకీయాల్లో ఆయన భారీ పలుకుబడి సాధించలేకపోయారు. సొంత పార్టీ పెట్టి ఆరిపోయారే తప్ప ఒక వెలుగు వెలగలేదు. కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ఇటీవల కొందరు ఏపీ బీజేపీ నేతలు కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన కిరణ్‌ పార్టీ విషయాలు మాత్రం ప్రస్తావించలేదని అంటున్నారు. ఏపీలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కిరణ్‌ సలహాలు తీసుకున్నామని సోము వీర్రాజు విూడియాకు చెప్పారు. కిరణ్‌ దగ్గర పార్టీ బలోపేతానికి సంబంధించి మంచి కార్యాచరణ ఉందని. ఆయన మార్గ నిర్దేశంలో పనిచేస్తామని సోమ వీర్రాజు చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం నడుచుకుంటానని ఏపీ తెలంగాణ ఎక్కడ పనిచేయమన్నా చేస్తానని కిరణ్‌ ప్రకటించారు. అయితే భారతీయ జనతా పార్టీలో చేరిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏపీ బీజేపీ బలోపేతం కోసం అప్పుడే గ్రౌండ్‌ వర్క్‌ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో ఆయన అనుచరులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే జైసమైక్యాంధ్ర పార్టీ వైఫల్యం తర్వాత రాజకీయ భవిష్యత్‌ కోసం ఎక్కువ మంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. కొంత మంది సొంత కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వారందరూ మళ్లీ కిరణ్‌ కుమార్‌ రెడ్డితో టచ్‌లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. కిరణ్‌ మధ్యవర్తిత్వంతో ఒకే సారి భారీగా చేరికల కోసం ప్లాన్‌ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొంత మంది మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నాయకత్వం కూడా కిరణ్‌ కుమార్‌ రెడ్డికి పూర్తి స్థాయిలో చేరికల విషయంలో స్వేచ్చ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్‌ అధ్యక్షుడ్ని మార్చారు. ఏ మాత్రం ప్రజల్లో పలుకుబడి లేని నేతను నియమించడంతో గతంలో ప్రజాప్రతినిధులుగా గెల్చిన వారు అసంతృప్తికి గురయ్యారు బహిరంగంగానే తమ వ్యతిరేకతను తెలిపారు. కానీ ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల అక్కడే ఉండిపోయారు. ఒక్కొక్కరుగా కాకుండా పెద్ద ఎత్తున మాజీ ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయంలో మంచి ముహుర్తం చూసుకుని చేరికల కార్యక్రమాలను ఖరారు చేసే అవకాశం ఉంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డికి బీజేపీ హైకమాండ్‌ గుర్తింపు ఇస్తోందన్న అభిప్రాయం కలిగితే ఎక్కువ మంది చేరే అవకాశం ఉంది. అందు కోసం ఓ పదవిని ప్రకటించాలన్న వాదన వినిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *