మరోసారి బాలినేనికి కోపం

ఒంగోలు, అక్టోబరు 18
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డికి మరోసారి కోపమొచ్చింది. తన గన్‌ మెన్లను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి బాలినేని లేఖ రాశారు. కొంతకాలంగా ఒంగోలు పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీని కోరారు. ఈ కేసులో తన పక్కనున్న వారినైనా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని సూచించారు. పోలీసులు అనధికారికంగా కొన్ని పేర్లు చెబుతున్నారని బాలినేని మండిపడ్డారు. అసలు దోషుల తెలిసినా కూడా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న బాలినేని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. నకిలీ భూ దస్తావేజుల కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఈ కేసులో అధికార పార్టీ నేతలు ఉన్నా వదిలిపెట్టవద్దని, అరెస్ట్‌ చేసి తీరాల్సిందేనన్నారు. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నానన్న బాలినేని, పోలీసులు తన సూచనలను పెడచెవిన పెడుతున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ భూ దస్తావేజుల కేసులో పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే తక్షణం, తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే మన పరిస్థితి ఏంటని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, ముఖ్యనాయకులు సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మన పరిస్థితి ఏమిటి ? భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ జనసేన, టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని గుర్తు చేశారు. టీడీపీ నిజంగానే అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి రీజనల్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డికి, సీఎం జగన్‌ చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో రెండవ సారి మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో అప్పటి నుంచి బాలినేని వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *