ఐస్‌క్రీం తింటున్నారా? బీ కేర్‌ ఫుల్‌

రాష్ట్రంలో కల్తీ కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. దేన్నీ వదలకుండా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వంటనూనె, పాలు వంటి నిత్యావసర పదార్థాలే కాకుండా చిన్న పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కూడా కల్తీ చేస్తు సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్ల కేసు మరువకముందే మరో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది.రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో నాణ్యతా ప్రమాణాలు లేకుండా నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న కంపెనీలను పోలీసులు గుర్తించారు. అపరిశుభ్రమైన పరిసరాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నారు. వాటిని బండ్ల వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతే కాకుండా బ్రాండెడ్‌ కంపెనీల లేబుల్స్‌ ను ఐస్‌ క్రీమ్‌ లకు అతికించి మార్కెట్‌ లో విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రెండు ఐస్‌క్రీమ్‌ తయారీ పరిశ్రమలపై దాడులు నిర్వహించారు. అక్కడ ఐస్‌ క్రీం తయారీ విధానం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్న అపరిశుభ్ర వాతావరణంలో ఐస్‌ క్రీమ్‌ లు తయారవుతున్నాయి. మురుగు నీటి పక్కనే రసాయనాలు, రంగుల నీరుతో ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. చిన్న పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఐస్‌ క్రీమ్స్‌ తయారు చేస్తున్న పరిశ్రమ నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు రెండు ఐస్‌ క్రీమ్‌ తయారీ కంపెనీలను మూసివేశారు.తాజాగా చందానగర్‌లోనూ కల్తీ ఐస్‌క్రీమ్‌ల దందా ఎక్కువైంది. హానికరమైన రసాయనాలను ఉపయోగించి నకిలీ ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. బ్రాండెడ్‌ పేర్లతో నకిలీ ఐస్‌ క్రీమ్స్‌ తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్టు గుర్తించారు. నకిలీ ఐస్‌క్రీమ్‌లతో పాటు ఫ్లేవర్‌ల లేబుల్స్‌, బ్రాండ్‌ కంపెనీలను స్వాధీనం చేసుకున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కూడా ఈ నకిలీ ఐస్‌క్రీమ్‌లు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా గత ఐదేళ్లుగా కొనసాగుతున్నట్లు విచారణలో తేలింది. నకిలీ ఐస్‌ క్రీమ్స్‌ తయారు చేస్తున్న నిందితుడు శ్రీనివాస్‌ ను అరెస్ట్‌ చేశారు. రసాయనాలతో తయారైన ఇలాంటి ఐస్‌ క్రీమ్‌ లు తింటే ఆరోగ్యానికి ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఐస్‌క్రీమ్‌లు తినే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, బీ కేర్‌ ఫుల్‌ గా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *