లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ.. 22 ఏళ్ల అమ్మాయిని బంధువులే చంపేశారు.. ఎందుకంటే?..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేసిందనే అనుమానంతో 22 ఏళ్ల అమ్మాయిని ఆమె బంధువులే కొట్టి చంపారు. ఆమె ఏడుపులు చుట్టుపక్కల వారికి వినిపించకుండా లౌడ్ స్పీకర్లను గట్టిగాపెట్టి మరీ చిత్రహింసలకు గురి చేశారు. మృతురాలు సమీనాగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమ బంధువులైనా రమేష్(40), హీనా కుమారుడి బర్త్ డే పార్టీలో పాల్గొనేందుకు సమీనా వారి ఇంటికి వెళ్లింది. అయితే ఆ బర్త్‌డే పార్టీలో రూ.4 లక్షల విలువైన నగలు, కొంత నగదు చోరీకి గురయ్యాయని సదరు దంపతులు ఆరోపించారు. ఈ విషయంలో రమేష్ మొదట తన భార్య హీనాను అనుమానించి చిత్రహింసలకు గురి చేశాడు. అనంతరం సమీనాను అనుమానించాడు.

దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవాలని రమేష్, హీనా, వారి బంధువులు.. సమీనాను చిత్రహింసలకు గురి చేశారు. సమీనాపై ప్లాస్టిక్ పైపులు, కర్రలతో దాడి చేశారు. సమీనాతోపాటు ఆమె వెంట వచ్చిన బంధువు, కారు డ్రైవర్‌పై కూడా దాడి చేశారు. సమీనా ఏడుపులు చుట్టుపక్కలవారికి వినిపించకుండా లౌడ్ స్పీకర్లలో గట్టిగా సంగీతాన్ని పెట్టారు. చివరకు వారి చిత్రహింసలు భరించలేక సమీనా చనిపోయింది. దీంతో సమీనా చావుకు కారణమైన నిందితులు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. కానీ కంగారులో సంగీతాన్ని ఆపకుండానే వెళ్లిపోయారు. దీంతో లౌడ్‌ స్పీకర్లు నిరంతరాయంగా రెండు రోజులపాటు పాడుతూనే ఉన్నాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే గాయపడిన సమీనా బంధువు, కారు డ్రైవర్‌ను కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవికుమార్ (ACP) మాట్లాడుతూ.. ‘‘మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం.’’ అని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *