ఎండలతో పోటీ పడుతున్న ధరలు

దేశంలో ఎండలు పెరిగినట్లే ధరలు కూడా పెరిగిపోతుండడంతో సామాన్యుల బాధలు చెప్పనలవి కావడం లేదు. ప్రజల సంపాదన అంతంత మాత్రమే ఉండడం, ధరలు మాత్రం పెరిగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అనే చందంగా ఉంది మధ్యతరగతి ప్రజల జీవితాలు. రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబానికి మూడు పూటలా భోజనం పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పుడు కొత్తగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మళ్లీ కరోనా కేసులు బయట పడుతున్నాయి. కేసులు బాగా పెరిగితే మళ్లీ లాక్‌ డౌన్‌ తప్పదు. దీంతో దేశంలో ధరల మోత మరోసారి మోగుతుంది. పాల నుంచి వంట గ్యాస్‌ వరకు, పన్నులతో పాటు, వైద్య ఖర్చుల భారీగా పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పెరిగిన ఖర్చులకు అనుకూలంగా ఆదాయాలు లేకపోవడంతో నెలనెలా భారం పెరుగుతూనే ఉంది. కడుపునిండా తినడానికి కూడా భయపడే రోజులు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. వంటింటి సరుకుల ధరలు భగ్గుమనిపించేలా చేసింది. గతంలో నెలవారిగా సరుకులు ఒకసారి తెచ్చుకుంటే, ఇప్పుడు వారానికోసారి తెచ్చుకోవడమే కష్టంగా ఉంది. జేబులో వెయ్యి రూపాయలు తీసుకొని వెళితే అరకొర సరుకులే వస్తున్నాయి. ఖర్చు లెక్కకు మించి అవుతుంది. పెరిగిన ఖర్చులకు అనుకూలంగా ఆదాయాలు లేకపోవడంతో నెల నెల భారం పెరుగుతుంది. ఇక పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో పాటు ఇంటి అద్దెలు, విద్యుత్‌ చార్జీలు, సొంతిల్లు కలిగిన వారికి ఆస్తి పన్నులు, విద్య, వైద్యంలో పెరిగిన ఖర్చులు, కూరగాయలు, పాలు ఇతర నిత్యావసర ధరలతో అన్ని తరగతుల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 5గురి కుటుంబ సభ్యుల ఇంటికి కూరగాయలకే వందకు పైగా ఖర్చు అవుతుంది. వీటితో పాటు వంటనూనె లీటరుకు రూ. 170 నుంచి రూ. 190 కి పెరిగింది. బియ్యం కిలో 50 నుంచి 60 వరకు పెరిగింది. ఇవి ఇలా ఉంటే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ధరలు పెరిగాయి. ఇక వంటలో కీలకమైన వంట గ్యాస్‌ ధర రూ.1,152 ఉంది. డెలివరీ ఖర్చుతో కలిపి రూ.1200. అలాగే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా రోజురోజుకు పెరుగుతూ జనానికి భారంగా మారుతున్నాయి. ఎన్నికలు ఉన్న సమయంలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కేంద్రం కొంత తగ్గించి ఎన్నికలు అయిపోగానే ఆయా రాష్ట్రాల్లో దానికి రెట్టింపుగా పెంచుతూ ఉంది.ఇక సామాన్య ప్రజలు దవాఖానాలోని మందులు కొనాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. దీర్ఘకాలిక మందుల ధరలు రెట్టింపు అయ్యాయి. యాంటీబయాటిక్స్‌ ధరలు పెరిగాయి. అలాగే విద్యుత్‌ చార్జీలు సైతం వివిధ చార్జీల పేరుతో రెండు మూడు నెలలకోసారి ఎడాపెడా పెంచుతున్నారు. దీంతో ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులే కాకుండా ప్రభుత్వంలో పనిచేసే చిరుద్యోగుల జీవన ప్రమాణాలు కూడా దారుణంగా తయారయ్యాయి. దీంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. అందుకే ధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గత తొమ్మిదేళ్లలో 60% నుంచి 75% నిత్యావసర ధరలు పెరిగాయి. ఇంటి ఖర్చులు డబుల్‌ అయ్యాయి. ఈ ధరలు పేద మధ్యతరగతి వారి విూదనే ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా సగటు పౌరుడు రోజురోజుకు పేదరికంలోకి నెట్టుకుపోతున్నాడని కేంద్ర గణాంకాలు తెలుపుతున్నాయి.దేశ జనాభాలో మధ్యతరగతి జనాభా 29%, జాతీయ ఆదాయంలో వారిది 79% వాటా, దేశీయ వస్తు ఉత్పత్తుల వినియోగదారుల్లో 70% వారే ఉన్నారు. అంటే దేశ ప్రగతిలో వారి పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల ఫలితంగా ఇప్పుడు దేశంలోని మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికీ దిగజారిపోయి నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు ఈ తొమ్మిదేళ్లలో రెండిరతలు అయింది. ద్రవ్యోల్బణ ప్రభావం అన్ని రంగాలపై పడి ధరలు పెంచుతున్నాయి.రెండు ఏళ్లలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లు పెంచడంతో రుణ గ్రహీతలకు ఈఎంఐ భారం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల బాధను అర్థం చేసుకొని ధరల నియంత్రణ చర్యలు తీసుకోవాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *