అంబులెన్స్‌ మాఫియా…

ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. ఆత్మీయులు చనిపోయి పుట్టెడు దు:ఖంలో కుటుంబ సభ్యులు ఉంటే మృతదేహాల తరలింపునకు నిర్ధాక్షిణ్యంగా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. శవాల మాటున కాసుల వేట కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు మాఫియాగా ఏర్పడి మృతదేహాల తరలింపులో దగ్గరి దూరాలకు కూడా వేలాది రూపాయలు వసూలు చేసేవారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచిత అంబులెన్స్‌ లను అందుబాటులో ఉంచింది. అయినా ప్రైవేట్‌ అంబులెన్స్‌ మాఫియా ఆగడాలకు చెక్‌ పడడం లేదు. కొంతమంది హాస్పిటల్‌ సిబ్బంది సహకారంతో వీరు రెచ్చిపోతున్నారు. కొన్ని సందర్భాలలో ఉచిత అంబులెన్స్‌ లు చెడిపోవడం, అందుబాటులో లేకపోవడం వీరికి కలిసి వస్తోంది. మృతుల కుటుంబ సభ్యులు తప్పనిసరి పరిస్థితులలో వీరిని ఆశ్రయిస్తుండడంతో దగ్గరి దూరానికి కూడా వేలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఉస్మానియా, గాంధీ వంటి పెద్ద ఆస్పత్రుల బయట అంబులెన్స్‌ లు నిలిపి లోపల బేరసారాలు సాగిస్తున్నారు.ఈఎన్టీ, కింగ్‌ కోఠి, నీలోఫర్‌, సుల్తాన్‌ బజార్‌ మెటర్నిటీ, పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి వంటి ఆస్పత్రులలో అంబులెన్స్‌ ల సంఖ్య తక్కువగా ఉంది. ఆయా ఆస్పత్రులకు వచ్చిన రోగులకు కొన్ని సందర్భాలలో ఇతర వైద్య పరీక్షలు అవసరమౌతుంటాయి. దీంతో వైద్యులు ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్‌ కు రెఫర్‌ చేస్తుంటారు. ఇక అక్కడి నుండి రోగులు, వారి సహాయకుల బాధలు మొదలౌతాయి. హాస్పిటల్‌ అంబులెన్స్‌ లు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో వారు ప్రైవేట్‌ అంబులెన్స్‌ లను ఆశ్రయిస్తున్నారు. దగ్గరి దూరాలకు కూడా వేలాది రూపాయలు ఇవ్వాలని ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు డిమాండ్‌ చేస్తుండగా వారు అడిగినంత ఇచ్చుకోక తప్పడం లేదు. ముఖ్యంగా జిల్లాల నుండి వచ్చిన రోగులు, వారి సహాయకులను టార్గెట్‌ చేసి నిలువు దోపిడికి పాల్పడుతున్నారు.ఉస్మానియా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌ ఆరీఫ్‌ ఆస్పత్రి ఆవరణలోనే మహిళను అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలో ఆరీఫ్‌ ఆస్పత్రి ఆవరణలో దర్జాగా కుర్చీలో కూర్చోవడం ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉందనేది అర్ధం అవుతోంది. హెల్త్‌ ఇన్‌ స్పెక్టర్లు, వార్డు బోయ్‌, సెక్యూర్టీ సిబ్బంది కొంతమంది ప్రైవేట్‌ అంబులెన్స్‌ ల నిర్వాహకులతో లాలూచీ పడి అక్రమార్జనకు తెరలేపుతున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. మహిళపై ఆరీఫ్‌ దాడి విషయంలో సిబ్బంది ప్రమేయంపై విచారణ జరుపుతున్నామని స్వయంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ ప్రకటించడంతో వారి పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి.ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో మహిళపై ఆరీఫ్‌ దాడి చేస్తున్నా స్పందించని సెక్యూర్టీని విధుల నుండి తొలగించారు. అంతేకాకుండా ఆరీఫ్‌ ను కుర్చీ వేసి కూర్చోబెట్టిన టెలీఫోన్‌ డబ్బాను తాత్కలికంగా మూయించారు. ఇతర సిబ్బంది ప్రమేయంపై కూడా విచారణ నిర్వహిస్తున్నారు.ఆస్పత్రి ఆవరణలో మహిళను బూతులు తిడుతూ దాడికి పాల్పడిన ఆరీఫ్‌ ను అఫ్జల్‌ గంజ్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు. బాధిత మహిళ లిఖిత పూర్వకంగా, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ మౌఖికంగా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *