పొత్తులు తేలేనా

ఖమ్మం, అక్టోబరు 19
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. అనుకూలంగా ఉన్నా అన్ని పార్టీలతో కలిసి పోయేందుకు రెఢ అవుతోంది. ఈక్రమంలోనే కాంగ్రెస్‌, వామపక్షాలు పొత్తుపై చర్చలు జరుపుతున్నాయి. సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకూ స్పష్టత రాకపోవడంతో ఖమ్మం జిల్లాలో రెండు పార్టీల శ్రేణుల్లో గందర గోళం నెలకొంది. జిల్లాలో సిపిఎంకు ఏ సీటు ఇస్తారనే దానిపై రోజుకో ప్రచారం జరుగుతోంది. సిపిఎం భద్రాచలం, పాలేరు రెండు నియోజకవర్గాల ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అవి కుదరకపోతే.. తాజాగా వైరా సీటు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందట. దీంతో కాంగ్రెస్‌ ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. సిపిఎంతో అసలు పొత్తు ఉంటుందా..? ఉంటే ఏ సీట్లు ఇస్తారు? అనే దానిపై పీటముడి వీడటం లేదు.పొత్తులపై కాంగ్రెస్‌, వామపక్షాల చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ మొదటి విడత అభ్యర్థులను ప్రకటించింది. రెండో విడత త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఖమ్మం జిల్లాలో సీపీఐకు కొత్తగూడెం..ఖరారు అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. సిపిఎంకు ఏ సీటు ఇస్తారనే దానిపై రోజుకో విధంగా ప్రచారం జరుగుతోంది. పాలేరు, భద్రాచలం కావాలని సిపిఎం పట్టుబడుతోంది. కానీ భద్రాచలం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు మళ్ళీ టికెట్‌ ప్రకటించారు. సిట్టింగ్‌ సీటు ఇవ్వడం కుదరదని కాంగ్రెస్‌ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది..మరో సీటు పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనుకున్నప్పటికీ.. మారిన సవిూకరణాలు నేపథ్యంలో.. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి పోటీ చేయడం దాదాపుగా ఖరారు అయ్యింది. పాలేరు కూడా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి.. తాజాగా వైరా సీటు సిపిఎంకు ఇస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు ఇవ్వకుండా పొత్తు కుదరదని సిపిఎం స్పష్టం చేస్తోంది. వైరా నియోజకవర్గంలో సిపిఎం పార్టీ 25 వేల ఓట్లు కలిగి ఉందని, వైరా సీటు దక్కించుకోవాలని..రాష్ట్ర జిల్లా కార్యవర్గ సమావేశాల్లో చర్చలు జరిగాయి. ఈమేరకు సిపిఎం జాతీయ నాయకులకు నివేదిక పంపించినట్లు పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయిఇదిలావుంటే దశాబ్దాల కాలంగా వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి లేకపోవడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇప్పటికే వైరాలో కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని వాపోతున్నారు. ఈసారైనా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని పార్టీని బలోపేతం చేయాలనుకునే సమయంలో.. వామపక్షాలు వైరా సీటుపై కన్నేశారని కాంగ్రెస్‌ పార్టీ ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వామపక్షాలకు ఇస్తే ఓటమి ఖాయమంటున్నారు. వైరాలో కాంగ్రెస్‌ పార్టీకే టికెట్‌ కేటాయించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. వైరా నియోజకవర్గ కాకుండా ఇతర నియోజకవర్గాల్లో సిపిఎం పార్టీకి కేటాయించాలని సూచిస్తున్నారు. గత ఐదేళ్ళుగా కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నామని, వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే మంచి అవకాశం ఉందని, అలాంటి సమయంలో వామపక్షాల కేటాయించటం తగదని వాదిస్తున్నారు..కాంగ్రెస్‌ తరపున నలుగురు ఆశావహులు టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. టికెట్‌ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులో సిపిఎంకు సీటు ఇస్తారనే ప్రచారంతో.. ఆందోళన చెందుతున్నారు. పొత్తులు, సీట్ల ఖరారుపై ఇప్పటి వరకూ స్పష్టత రాకపోవడంతో.. రోజుకో విధంగా ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు పొత్తు ఉంటుందా..? లేదా..? ఉంటే ఏ సీటు ఇస్తారు..! అనే దానిపై ఖమ్మం జిల్లాలో సీట్ల సర్దుబాటుపై పీటముడి వీడటం లేదు. దీంతో ఇరు పార్టీల ఆశావహులు, శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *