గోల్డ్‌ షాపులో గ్యాంగ్‌ సీన్‌…

హైదరాబాద్‌ లో సినిమా సీన్‌ తరహాలో ఓ చోరీ జరిగింది. మోండా మార్కెట్‌ లోని జ్యూవెలరీ షాపులో ఐటీ అధికారులమంటూ తనిఖీలు చేసిన దుండగులు 17 బంగారం బిస్కెట్లు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్‌ లో గ్యాంగ్‌ సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. ఐటీ అధికారులమంటూ జ్యూవెలరీ షాపులోకి ఎంట్రీ ఇచ్చిన దుండగులు… తనిఖీల పేరుతో హడావుడి చేశారు. సిబ్బందిని నిర్బంధించి సోదాలు చేశారు. చివరికి లెక్కకు మించిన బంగారం ఉందంటూ 1700 గ్రాముల బంగారంతో ఉడాయించారు. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో పట్టపగలే దుండగులు చోరీకి పాల్పడ్డారు. శనివారం రద్దీగా ఉండే మోండా మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెలరీ షాపునకు వచ్చారు ఐదుగురు వ్యక్తులు. రావడంతోనే ఐటీ అధికారులమంటూ కవరింగ్‌ ఇచ్చి గోల్డ్‌ కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారని బెదిరింపులకు పాల్పడ్డారు. షాపు మొత్తం తనిఖీ చేయాలని సిబ్బందిని ఒక పక్కన కూర్చోబెట్టారు. షాపులో ఉన్న 1700 గ్రాముల బంగారానికి లెక్కలు సరిగాలేవని, అందుకు సంబంధించి ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించలేదని దుండగులు బెదరించారు. ఆ బంగారం స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడి నుంచి బంగారంతో పరారయ్యారు.దుండగులు వెళ్లిపోయిన తర్వాత బంగారం షాపు యజమాని మిగతా జ్యూవెలరీ షాపులకు ఐటీ అధికారులు వచ్చి తనిఖీలు చేసిన విషయం చెప్పాడు. ఐటీ అధికారులు అలా వచ్చి తనిఖీలు చేయరని, నోటీసులు ఇస్తారని చెప్పడంతో అనుమానం వచ్చిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఐటీ అధికారులతో మాట్లాడిన పోలీసులు జ్యూవెలరీ షాపులో తనిఖీలు చేసింది నకిలీ ఐటీ అధికారులని నిర్థారించుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నకిలీ ఐటీ అధికారుల పేరుతో సోదాలు చేసినట్టు గుర్తించారు. షాపు యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా ఐటీ అధికారులు ఎలా తనిఖీలు చేస్తారో అదే విధంగా తనిఖీలు చేశారన్నారు. ఈ ఘటన తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు పారిపోయినట్లు పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు.సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ పరిధిలో జ్యూవెలరీ చోరీ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్టు డీసీపీ చందన దీప్తి తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించి మొత్తం ఆరుగురికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు గుర్తించామన్నారు. మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన రివెన్‌ మధుకర్‌ బవర్‌ నాలుగు నెలల క్రితం మోండా మార్కెట్‌లో బంగారం దుకాణం పెట్టుకున్నారు. మధుకర్‌ సొంతూరు వెళ్లడంతో అతని బంధువు వికాస్‌ ఖేదకర్‌ మోండా మార్కెట్‌ లోని గోల్డ్‌ షాప్‌లో తయారీ పని చూసుకుంటున్నాడు. వికాస్‌ ఖేదర్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో బంగారం షాపు నిర్వహిస్తున్నాడు. నకిలీ ఐటీ అధికారులు చోరీకి పాల్పడిన ఘటనలో మొత్తం ముగ్గురు పనివాళ్లు షాపులో ఉన్నారు. ఐటీ అధికారులమని ఐడీ కార్డులు చూపించిన దుండగులు… మొత్తం 17 బంగారం బిస్కెట్లు చోరీ చేశారు. గోల్డ్‌ స్వాధీనం చేసుకున్న తర్వాత పనివాళ్లను లోపల పెట్టి బయట గడియపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ చోరీ తెలిసిన వాళ్ల పనేనని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను తర్వలోనే పట్టుకుంటామని డీసీపీ దీప్తి తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *