అమ్మకానికి విశాఖ పోర్టు

ప్రతిష్టాత్మకమైన వైజాగ్‌ పోర్టు ట్రస్ట్‌ (విపిటి) క్రమంగా ప్రైవేటు పరమవుతోంది. పిపిపి విధానంలో దేశంలోని 13 మేజర్‌ పోర్టులను కేంద్రం ప్రైవేటు పరం చేస్తోంది. అందులో భాగంగా విశాఖ పోర్టును ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం శరవేగంగా ముందుకు కదులుతోంది. విశాఖ పోర్టు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కె.రామ్మోహనరావు తీరు చూస్తే అది అర్థమవుతోంది. ఈయన చైర్మన్‌గా రాక ముందు ఆరు బెర్తులు పిపిపిలోకి వెళ్లిపోయాయి. ఈయన వచ్చాక మూడు, తాజాగా మరో రెండు పిపిపిలోకి వెళ్లిపోతున్నాయన్న చర్చ పోర్టు వర్గాల నుంచి వినిపిస్తోంది.పిపిపిలో వైజాగ్‌ పోర్టులోని ఎస్సార్‌కు 1, వేదాంత 1, ఎవిఆర్‌ 1, విసిటిపిఎల్‌ 2, విఎస్‌పిఎల్‌ 1 పిపిపిలోకి తొలి దశలో వెళ్లిపోయాయి. ఒక్కో బెర్తులో 120 నుంచి 150 మంది కాంట్రాక్టు కార్మికులను నియమించుకున్నారు. రెండో దశ పిపిపిలో భాగంగా డబ్ల్యూ క్యూ 7, 8, ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6 బెర్తులు పిపిపిలోకి వెళ్లిపోయాయి. అయితే ఈ బెర్తులకు ఇంకా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్‌ రావాల్సి ఉంది. నేడో రేపో వస్తుందని పోర్టు ఉన్నతాధికార వర్గాల సమాచారం. ఈ మూడూ కాకుండా తాజాగా మరో రెండు ప్రాజెక్టులను పిపిపిలో పెట్టేశారు. వీటిలో ప్రతిష్టాత్మకమైన పోర్టు ఆసుపత్రి ఉండడం విశేషం. ఆరు ఎకరాల స్థలం, పోర్టు ఆసుపత్రి సహా పిపిపి ప్రాజెక్టులోకి వెళ్లిపోనున్నాయి. ఈ బెర్తుల్లో కేవలం పర్యవేక్షణ సెక్షన్‌ అధికారులు మాత్రమే ఉంటారు. 25 పోర్టు బెర్తుల్లో సుమారు 11 పిపిపిలోకి వెళ్లిపోవడంతో గడచిన 15ఏళ్లుగా పర్మినెంట్‌ ఉద్యోగ ప్రక్రియ నిలిచిపోయింది.15వేల వరకూ ఉండే పర్మినెంట్‌ ఉద్యోగుల సంఖ్య నేడు మూడు వేలకు పడిపోయింది. పోర్టు ఆసుపత్రి స్థానంలో సుమారు రూ.200 కోట్లతో మల్టీ సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రి పిపిపి పద్దతిలో నిర్మించనున్నట్లు పోర్టు యాజమాన్యం చెబుతోంది.తాజాగా పోర్టు యాజమాన్యం పిపిపి 2వ దశలో 3 బెర్తులకు టెండర్లు పిలవగా మూడు టెండర్లు వచ్చాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌ రావాల్సి ఉంది. పోర్టులో బెర్తు తీసుకుని కార్గో చేయకుండా పోర్టుకు ఆర్థికంగా నష్టం చేకూర్చిన అదానీని పిపిపి 2వ దశ టెండర్లలో పాల్గొనకుండా అనర్హత వేటు వేసింది. దీంతో అదానీ కోర్టులో ఛాలెంజ్‌ చేయగా పోర్టుకు చెందిన కొంతమంది అధికారులు తాజాగా వాదనలు వినిపించేందుకు హైదరాబాద్‌, ఢల్లీికి సిద్ధమయ్యారు. 3వ దశ పిపిపిలో ఈక్యూ `6 బెర్తుకు అలాగే పోర్టు ఆసుపత్రికీ టెండర్లను పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *