జగన్‌ అడ్డాలో జనసేనాని

ఏపీ సీఎం జగన్‌ అడ్డాలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కాలు పెడుతున్నారు. పంటలు నష్టపోయి బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేనాని రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. పంటసాగులో నష్టాల పాలై, అప్పుల బాధతో కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడమే కాకుండా.. ఒక్కొక్క బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పవన్‌ కళ్యాణ్‌ ఆర్థిక సాయం అంద జేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల పిల్లలకు చదువులను కూడా జనసేన పార్టీయే చూసుకుంటుందని భరోసా ఇస్తున్నారు. అందు కోసం జనసేనాని ఒక నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం తీరుపైన, వైఎస్‌ జగన్‌ పరిపాలనా విధానాలపైన సమయం చిక్కిన ప్రతిసారీ విమర్శలు ఎక్కుపెడుతున్న పవన్‌ కళ్యాణ్‌.. జగన్‌ సొంత ఇలాఖాలో అడుగుపెడుతుండడంతో వైసీపీ శ్రేణుల్లో హీట్‌ పెంచేసింది. గతంలో చేసిన విమర్శలకు తోడు ఇప్పుడు తాజాగా మళ్లీ వైసీపీ పైన, జగన్‌ పైన ఇంకెలాంటి ఆరోపణలు సంధిస్తారో, ఏ విధంగా ఇరుకున పెడతారో అనే సంశయాలు వైసీపీ శ్రేణుల్లో పెరిగిపోతున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సొంత జిల్లానే పవన్‌ కళ్యాణ్‌ టార్గెట్‌ చేస్తుండడంతో వైసీపీ నేతలు, శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో అంటే.. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆ పార్టీ అధినేత చిరంజీవి వాహనాలను వైఎస్సార్‌ అనుచరులు, బంధువులు ధ్వంసం చేశారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ పర్యటన సందర్భంగా అప్పటి మాదిరిగా అవాంఛనీయ సంఘటనలేవైనా జరుగుతాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ గతంలో మాదిరిగానే ఇప్పుడు వైసీపీ శ్రుణులు గానీ, వైఎస్సార్‌ బంధువులు గానీ జనసేన అధినేత వాహనాలపైన, వాహన శ్రేణిపైన దాడులకు దిగితే.. అనంతర పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అనే భయాలు నెలకొంటున్నాయి.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనే 12 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని జనసేన నేతలు చెబుతున్నారు. అంతే కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా 80 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తామని నోటిమాటగా చెప్పడమే కానీ.. సీఎం జగన్‌ ఒక్క కుటుంబానికి కూడా పరిహారం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా కింద 7 లక్షల రూపాయల బీమా చెల్లించడం లేదని జనసేన నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సభలకు వెళ్లకుండా కౌలు రైతు కుటుంబాలను వైసీపీ నేతలు, అధికారులు వేధిస్తున్నారంటూ జనసేన నేతలు ఆరోపిస్తుండడం గమనార్హం.ఒక పక్కన తన సొంత జిల్లా, మరో పక్కన కౌలు రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించకుండా, బీమా అందించకుండా తన సర్కార్‌ చేతులెత్తేసిన నేపథ్యంలో జనసేన అధినేత నేరుగా ఆయా బాధిత కుటుంబాలకే ఆర్థిక సాయం చేసేందుకు వస్తుండడాన్ని వైసీపీ నేతలకు అస్సలు సహించలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత, పవన్‌ కళ్యాన్‌ సొంత అన్న చిరంజీవి వాహనాలను ధ్వంసం చేసినట్లే ఇప్పుడు కూడా వైసీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కడప జిల్లాలో కౌలురైతు భరోసా యాత్ర సందర్భంగా రాజంపేట నియోజకవర్గం సిద్దవటంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని కౌలు రైతు కుటుంబాల కష్టాలను పవన్‌ కళ్యాణ్‌ అడిగి తెలుసుకుంటారు.ఇప్పటికే సరైన ప్రణాళిక లేకుండా పరిపాలన సాగిస్తూ.. అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న వైసీపీకి ఇప్పుడు జనసేనాని కడప టూర్‌ గోరుచుట్టు విూద రోకలిపోటులా మారనుందా? అనే భయాలు ఆ పార్టీ నేతల్లో పట్టుకున్నాయంటున్నారు. రైతు భరోసా అంటూ పవన్‌ కళ్యాణ్‌ తమ జిల్లాకు వచ్చి, వైసీపీ సర్కార్‌ పైన, జగన్‌ పైన ఎలాంటి బాంబులు పేలుస్తారో అనే ఆందోళన పట్టుకుందంటున్నారు. మొత్తానికి జగన్‌ ఇలాఖాలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన వైసీపీ నేతుల, శ్రేణుల్లో తీవ్రమైన హీట్‌ కు కారణం అవుతుందా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *