యాదాద్రి గోపురానికి అందని బంగారం

నల్గోండ, జూలై 4
బంగారు ఆభరణాలు, సిరిసంపదలను మనం కోరుకుంటాం.. వాటి కోసం ఎన్నో కష్టాలు పడుతుంటాం.. అలాంటి సిరి సంపదలు ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటాం.. కష్టాల నుంచి బయట పడేయాలంటూ దేవుడిని ప్రార్థిస్తాం. ఇప్పుడు దేవుడికే ఆలాంటి కష్టాలు వస్తే.. భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి బంగారు కష్టాలు తప్పడం లేదు. యాదగిరి సుడి బంగారు కష్టాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నరసింహస్వామి దేవాలయాన్ని చరిత్రలో నిలిచి పోయేలా పునర్నిర్మాణం చేపట్టారు. మహా కుంభ సంప్రోక్షణ నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో సీఎం కేసీఆర్‌ లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని125 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు భక్తులందరిని భాగస్వామ్యం చేయాలనుకున్నారు. బంగారు తాపడానికి సీఎం కేసీఆర్‌తో పాటు 22 కిలోల బంగారం ఇచ్చే మరికొందరి దాతల వివరాలు ప్రకటించారు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమాన గోపురాన్ని బంగారు తాపడం కోసం మొదటగా తన కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించారు. కుటుంబంతో కలిసి వచ్చిన సీఎం కేసీఆర్‌ కిలో 16 తులాల బంగారాన్ని స్వామివారికి విరాళంగా అందజేశారు.ప్రధాన ఆలయ గోపురానికి స్వర్ణ తాపడానికి ఆశించిన స్థాయిలో దాతల నుంచి స్పందన రాలేదు. ఇప్పటికీ దాతల నుంచి కేవలం 8 కిలోల 257 గ్రాముల బంగారం, రూ. 23 కోట్ల మాత్రమే సమకూరింది. తాపడం కోసం రూ. 65 కోట్లు ఖర్చవుతుంది. అయితే ఇప్పటివరకు సుమారు 29 కోట్ల రూపాయలు సమకూరింది. మొత్తం సమకూరాక రిజర్వు బ్యాంకు నుంచి స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేసి స్వామి వారి గర్భగుడి దివ్య విమానానికి బంగారు తాపడం చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే అధికార పార్టీ నేతలు కొందరు స్వర్ణ తాపడానికి విరాళాలను ఇచ్చారు. మరికొందరు కూడా ఇస్తామని కూడా ప్రకటించారు. కానీ ఆలయ ఉద్ఘాటన జరిగి ఏడాది అవుతున్న దాతలు మాత్రం ముందుకు రావడం లేదు. సాధారణ భక్తులతో పాటు నేతలు కూడా ఇంకా విరాళాలు ఇస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన అనేకమంది మంత్రులు ఎమ్మెల్యేలు స్వర్ణ తాపడానికి విరాళాలు ఇచ్చారు.స్వర్ణ తాపడానికి విరాళాలు ఇస్తామని ప్రకటించిన నేతలు, వ్యాపారవేత్తలు, బడా బాబులు ముందుకు రావాలని భక్తులు కోరుతున్నారు. ఆర్థికంగా ఉన్నవారు స్వామివారి దివ్య గోపు విమాన గోపురానికి కావలసిన బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సామాన్య భక్తులు తమకు తోచిన సహాయాన్ని హుండీలో వేస్తున్నప్పటికీ ఆర్థికంగా ఉన్న వారు బంగారు విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికైనా దాతలు ముందుకు వచ్చి దివ్య విమాన గోపురానికి బంగారం అందజేయాలనీ ఆలయ అధికారులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *