గురుపత్వంత్ హత్యకు కుట్ర కేసు.. భారత్ దర్యాప్తుపై అమెరికా కీలక వ్యాఖ్యలు

Antony Blinken: అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ని హత్య చేసేందుకు కుట్ర పన్నారని, దీనిని తాము భగ్నం చేశామని ఇటీవల అమెరికా అధికారులు భారత్‌కు తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్రలో భారత ప్రభుత్వ అధికారి ప్రమేయం ఉందన్న ఆరోపణలను వాషింగ్టన్ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ఉన్న బ్లింకెన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఆంటోనీ మాట్లాడుతూ.. ఈ కేసు సబ్ జ్యూడీస్ (న్యాయపరమైన పరిశీలన పెండింగ్‌లో ఉండటం) అయినందున తాను వివరింగా వ్యాఖ్యానించలేనని అన్నారు. అయితే.. పన్నూన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత ప్రభుత్వం ప్రారంభించిన దర్యాప్తును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఈ అంశాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామన్న ఆయన.. గత వారంలోనే దీని గురించి భారత ప్రభుత్వంతో నేరుగా లేవనెత్తామని పేర్కొన్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించిందని.. ఇది మంచి పరిణామమని.. ఈ దర్యాప్తుని భారత ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో చూసేందుకు ఉత్సుకతతో ఉన్నానని చెప్పుకొచ్చారు.

భారతదేశం ఒక వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోందని.. దానిని మరింత మెరుగుపరిచేందుకు, బలోపేతం చేసేందుకు తాము భారత్‌తో కలిసి పని చేస్తూనే ఉంటామని ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు. అంతకుముందు.. వైట్‌హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ కూడా పన్నూన్ హత్యకు కుట్ర కేసుపై భారత్ ప్రారంభించిన దర్యాప్తుపై స్పందించారు. భారత్ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని, దీనిపై దర్యాప్తు ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. కాగా.. పన్నూన్ హత్యకు విఫలమైన కుట్రలో భారత పౌరుడు నిఖిల్ గుప్తా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *