తెరపైకి రజకార్‌ ఫైల్స్‌ సినిమా

బీజేపీ అగ్రనేత అమిత్‌ షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి కంటి విూద కునుకు లేకుండా చేస్తుంది. కొన్నేళ్లుగా సినిమాలు తప్ప మరో ప్రపంచమే తెలియని తారక్‌.. మళ్లీ రాజకీయాల వైపు వస్తున్నారా..? కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో యంగ్‌ టైగర్‌ భేటీ వెనక ఆంతర్యమేంటి..? ట్రిపుల్‌ ఆర్‌ కోసమే అయితే.. రామ్‌ చరణ్‌ లేకుండా స్పెషల్‌ విూటింగ్‌ ఎందుకు..? కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను జూనియర్‌ ఎన్టీఆర్‌ కలవడం ఎక్కడలేని ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ వర్గాల్లో కంటే.. రాజకీయంగా ఈ భేటీ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. బీజేపీ అగ్ర నేతతో తారక్‌కు పనేంటి..? అంత ప్రత్యేకంగా ఈ ఇద్దరూ కలవడానికి కారణమేంటంటూ ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది. ట్రిపుల్‌ ఆర్‌లో కొమరం భీమ్‌ పాత్ర నచ్చి.. అమిత్‌ షా ప్రశంసించారని తారక్‌ వర్గాలు చెప్తున్న మాట. అయితే ఈ భేటీ వెనుక పాలిటిక్స్‌ తప్ప మరొకటి లేదన్నది మరికొందరి అభిప్రాయం. భేటీ తర్వాత ఎలాంటి లీకులు రాకపోవడంతో నిజంగా వారిద్దరూ ఏ అంశాలపై చర్చించారన్న ఆసక్తి నెలకొంటోంది.తారక్‌, అమిత్‌ షా భేటీ వెనక మరో వార్త టాలీవుడ్‌ వర్గాల్లో బాగా వైరల్‌ అవుతుంది. ది కాశ్మీర్‌ ఫైల్స్‌ తరహాలోనే.. రజాకార్‌ ఫైల్స్‌ అనే సినిమా ఒకటి త్వరలోనే రాబోతుంది. దీనికి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. బిజేపీ ప్రభుత్వ సపోర్ట్‌తోనే రజాకార్‌ ఫైల్స్‌ భారీ ఎత్తున తెరకెక్కబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇందులో తారక్‌ను నటింపచేయాలనేది పార్టీ ఎత్తుగడలా కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. తారక్‌, అమిత్‌ షా మధ్య రాజకీయ చర్చకు తావేం లేదని.. కేవలం ఈ రజకార్‌ ఫైల్స్‌ సినిమా గురించి చర్చించుకున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అటు రాజకీయం, ఇటు సినిమాలపై పూర్తి అవగాహన ఉన్న తారక్‌.. తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తును అంచనా వేసుకునే నిర్ణయం తీసుకుంటారనే అతన్ని దగ్గర్నుంచి గమనించిన వాళ్ళకు అర్థమవుతుంది. మరి రజాకార్‌ ఫైల్స్‌ విషయంలో అమిత్‌ షా తారక మంత్రం ఎంతవరకు పని చేస్తుందనేది మిలియన్‌ డాలర్స్‌ ప్రశ్న.
టీడీపీయే టార్గెట్టా….
జూనియర్‌ ఎన్టీఆర్‌, అమిత్‌ షా భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని కలిగించింది. జూనియర్‌ ను బీజేపీ భవిష్యత్‌ లో రాజకీయంగా ఉపయోగించుకోవడానికే ఈ భేటీ జరిగిందన్న కామెంట్స్‌ వినపడుతున్నాయి. బీజేపీకి తెలంగాణలో జూనియర్‌ అవసరం పెద్దగా లేకపోవచ్చు. ఆయన అభిమానులు తెలంగాణలో ఉన్నప్పటికీ ఇక్కడ బలపడే అవకాశాలున్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్‌ ను వెనక్కు నెట్టి బీజేపీ ముందుకు వచ్చిందనే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక్కడ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చు. తెలంగాణలో పార్టీకి అదనపు అండగానే జూనియర్‌ ఉపయోగపడతారు తప్పించి ఆయనే ఇక్కడ ఓట్లు కురిపించడానికి ప్రధాన వ్యక్తిగా మారతారని అనుకోలేం.కానీ జూనియర్‌ ఎన్టీఆర్‌ వల్ల ఆంధ్రప్రదేశ్‌ లో ప్రయోజనం ఉంటుంది. ప్రధానంగా టీడీపీ బలంగా ఉన్నా ఆ పార్టీ నాయకత్వంపై భవిష్యత్‌ లో సందేహాలయితే ఉన్నాయి. చంద్రబాబు తర్వాత నారా లోకేష్‌ తప్ప ఎవరికీ ఛాన్స్‌ ఉండదన్న విషయం అందరికీ తెలుసు. నారా లోకేష్‌ ఇంకా రాజకీయంగా రాటు దేలలేదన్నది పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం. చంద్రబాబుపై ప్రజల్లోనూ, క్యాడర్‌ లోనూ విశ్వాసం ఉన్నట్లు నారా లోకేష్‌ పై కన్పించడం లేదు. రాజకీయ అంశాలపై అవగాహన లోపంతో పాటు ఆయన ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు కూడా పెద్దగా పేలడం లేదు. అందుకే నారా లోకేష్‌ సారథ్యంలో పార్టీ బలోపేతం అవుతుందని మాత్రం ఇప్పటి వరకూ అయితే ఎవరూ నమ్మడం లేదు. భవిష?యత్‌ లో ఆయన తండ్రిమాదిరిగా వ్యూహాలను రచించడంలో దిట్ట అవుతారామో కాని ఇప్పటి వరకూ అయితే లోకేష్‌ ను నాయకుడిగా అంగీకరించని వారే అధికంగా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ ఉన్నా ఆయన ఫుల్‌ టైం రాజకీయ నేతకాదు. పార్టీ పగ్గాలు కూడా చేపట్టే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలే కనిపిస్తుండటం ఇందుకు ఉదాహరణ. పార్టీ అభిమానులు, కింది స్థాయి క్యాడర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ పార్టీలో క్రియాశీలకంగా మారాలని భావిస్తున్నారు. కానీ జూనియర్‌ మాత్రం తనకు ఇప్పుడే రాజకీయాల్లో రావాలని ఆలోచన చేయడం లేదని చెబుతూ వస్తున్నారు. అలాగని టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయరని కూడా చెప్పలేం. చంద్రబాబు ఇప్పటికే ఎన్టీఆర్‌ కుటుంబంతో మరింత సఖ్యతగా మెలిగేందుకు సిద్ధమవుతున్నారు. తన చిరకాల ప్రత్యర్థి అయిన దగ్గుబాట ? వెంకటేశ్వరరావును కూడా దువ్వడానికి సిద్ధమయ్యారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ను ప్రచారంలోకి తీసుకు రావడం ఆయనకో పెద్ద లెక్కకాదన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్‌. . అందుకే ముందుజాగ్రత్తగా బీజేపీ అప్రమత్తమయినట్లు కనపడుతుంది. జూనియర్‌ కు టీడీపీ నాయకత్వం అప్పగిస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవచ్చు. జూనియర్‌ ని టీడీపీ దూరం పెడితే తాము దగ్గరకు తీయాలన్న లక్ష్యంతో ఒక చిన్న పాటి ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది. ఎటూ బీజేపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అత్త, ఎన్టీఆర్‌ కుమార్తె పురంద్రీశ్వరి బీజేపీలో క్రియాశీలంకగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా అప్పగించాలన్న యోచనలో బీజేపీ నాయకత్వం ఉంది. చంద్రబాబును, ఆయన పార్టీని ఏపీలో డల్‌ చేయగలిగితే బీజేపీ పుంజుకునే అవకాశాలున్నాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ మద్దతిస్తే బీజేపీలో చేరికలు కూడా భారీగా ఉంటాయి. ఒక ప్రధాన సామాజికవర్గం కూడా అండగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక ఆయన ఫ్యాన్స్‌ సంగతి సరేసరి. ఇన్ని లెక్కలు వేసే అమిత్‌ షా జూనియర్‌ ఎన్టీఆర్తో భేటీ అయ్యారంటున్నారు. బీజేపీ వాడుకుంటే ఎవరినైనా మామూలుగా వాడుకోదు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అందుకే జూనియర్‌ తో జట్టు కట్టేందుకే అమిత్‌ షా భేటీ అయ్యారన్నది రాజకీయ విశ్లేషకులు అంగీకరిస్తున్న విషయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *